పీసీసీ : తెర మీదకు సీతక్క !
ఆదివాసి మహిళకు తొలిసారి ఇచ్చినట్లు అవుతుందని ఈ మేరకు ఏఐసీసీకి సీతక్క పేరును సిఫారసు చేయనున్నట్లు తెలుస్తుంది.
By: Tupaki Desk | 25 May 2024 5:04 AM GMTలోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పీసీసీ పీఠం తనకే ఇవ్వాలని మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా పట్టుబడుతున్నాడు. తన భార్యకు ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వని నేపథ్యంలో పీసీసీ అయినా ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఒడిశా, యూపీ రాయ్ బరేలిలో ప్రచారం చేసిన భట్టి పట్టుబట్టి పంజాబ్ లోని ఫరీద్ కోట్ లోక్ సభ స్థానం పరిశీలకుడిగా అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు.
అయితే భట్టికి పోటీగా సీఎం రేవంత్ వర్గం మహేష్ కుమార్ గౌడ్ పేరును తెరమీదకు తెచ్చింది. ముఖ్యమంత్రి స్థానంలో ఓసీ, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ లుగా ఎస్సీలు ఉన్నందున పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తే సముచితంగా ఉంటుందన్న వాదన తీసుకువచ్చారు. అయితే బీసీ సామాజిక వర్గం నుండి మధు యాష్కీ గౌడ్ ఈ పదవిని ఆశిస్తున్నాడు.
ఇక వీరితో పాటు అలంపూర్ ఎమ్మెల్యేగా ఓడిపోయి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా పీసీసీ పీఠం మీద కన్నేశాడు. అటు శాసనసభ టికెట్, ఇటు శాసనమండలి పదవి, తాజాగా లోక్ సభ టికెట్ దక్కని అద్దంకి దయాకర్ కూడా పీసీసీ పీఠాన్ని ఆశిస్తుండగా, సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డి కూడా ఈ పదవి కోసం తహతహలాడుతున్నాడు.
అయితే తన వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు పోటీగా అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీగా వస్తున్న నేపథ్యంలో ప్లాన్ బీ కింద మంత్రి సీతక్క పేరును రేవంత్ వర్గం తెరమీదకు తెచ్చింది. ఆదివాసి మహిళకు తొలిసారి ఇచ్చినట్లు అవుతుందని ఈ మేరకు ఏఐసీసీకి సీతక్క పేరును సిఫారసు చేయనున్నట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితులలో పాలన పగ్గాలు, పార్టీ పగ్గాలు తమ చేతులలోనే ఉండాలన్న ఉద్దేశంతో రేవంత్ వర్గం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మరి ఎవరి ఎత్తులు ఫలిస్తాయో వేచిచూడాలి.