వైసీపీ ఎమ్మెల్యేలు త్రిశంకు స్వర్గంలో ?
ఎమ్మెల్యే అంటే నాలుగు దశాబ్దాల క్రితం ఎంతో దర్జా వైభవం ఉండేవి. ఆయన ఏకంగా లక్షలాది మంది నియోజకవర్గం ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండేవారు.
By: Tupaki Desk | 20 March 2025 9:00 PM ISTఎమ్మెల్యే అంటే నాలుగు దశాబ్దాల క్రితం ఎంతో దర్జా వైభవం ఉండేవి. ఆయన ఏకంగా లక్షలాది మంది నియోజకవర్గం ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినా అసెంబ్లీలో బలంగా వాణిని వినీపిస్తూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకునేవారు.
నిజానికి చూస్తే అధికార పక్షంలో కంటే విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలే ఒక వెలుగు వెలిగేవారు. ఎం వెంకయ్యనాయుడు, ఎస్ జైపాల్ రెడ్డి వంటి వారు 1978 ప్రాంతంలో ఉమ్మడి ఏపీలో విపక్ష ఎమ్మెల్యేలుగా చాలా ధాటీగా మాట్లాడేవారు. ఇక ఉత్తరాంధ్ర కు చెందిన గౌతు లచ్చన అయితే ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉంటూ పేరు తెచ్చుకున్నారు.
రాను రానూ పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రజా సమస్యలు ప్రస్తావించడం కూడా తగ్గుతోంది. రాజకీయ విమర్శలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో పాటు విపక్షాన్ని కట్టడి చేసేందుకు చూస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నారు.
ఇలా సాగుతున్న పరిణామాల వల్ల చట్ట సభలలో ప్రజా సమస్యల ప్రస్తావన ఇంకా ఎక్కువగా జరగాలన్నది ప్రజల భావనగా ఉంది. ఇక విపక్షాలు సభకు హాజరైతేనే సభకు నిండుతనం వస్తుంది. అయితే ఏపీలో చూస్తే వైసీపీ తమకు విపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని చెబుతోంది. రూల్స్ లో ఎక్కడా ఇంత నంబర్ తో హోదా ఇవ్వాలని లేదని అంటోంది.
ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉంటున్నారు. అయితే మొత్తం అరవై రోజుల వ్యవధిలో సభకు ఎవరైతే గైర్ హాజరు అవుతారో ఆటోమేటిక్ గా వారి సభ్యత్వం రద్దు అవుతుంది అని శాసన సభ రూల్స్ చెబుతున్నాయి. ఆ విధంగా వైసీపీ ఎమ్మెల్యేల మీద యాక్షన్ ఉంటుందని వార్తలు రావడంతో రాజకీయ కలకలం రేగింది.
ఇక బడ్జెట్ సెషన్ మొదటి రోజు అయిన గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులతో కలసి జగన్ హాజరయ్యారు. ఆ తరువాత ఆయన రాలేదు, ఎమ్మెల్యేలు కూడా సభకు రావడం లేదు. అయితే ఎవరూ రావడం లేదని అంతా అనుకున్నారు. కానీ ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిష్టర్ లో సంతకాలు చేసి వెళ్ళిపోతునారు అంటూ వార్తలు వస్తున్నాయి.
చాలా మంది సభ్యులు సభలో ఉండకుండా రిజిష్టర్ లో సంతకం చేసి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. అయితే అందులో వైసీపీకి చెందిన ఏడుగురు ఉన్నారని చెబుతున్నారు. దాంతో వారి మీదనే చర్చ సాగుతోంది. నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రావాలని అనుకున్నా అధినాయకత్వం అనుమతి ఉండాలి.
బడ్జెట్ సెషన్ కి మాత్రమే హాజరైన తరువాత వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళకూడదని అధినాయకత్వం నిర్ణయించింది. మరి ఈ మధ్యలో కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ రిజిష్టర్ లో సంతకాలు చేయడం ఏమిటి అన్నది చర్చ సాగుతోంది. ఇది వైసీపీ అధినాయకత్వానికి తెలిసి జరుగుతోందా లేక ఎవరికి వారుగా చేస్తున్నారా లేక ఈ ప్రచారంలో నిజమెంత ఉంది అన్నది కూడా చర్చిస్తున్నారు.
ఇలా రిజిష్టర్ లో సంతకాలు చేస్తున్న వారిలో చూస్తే బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, అమరనాధ్ రెడ్డి, దాసరి సుధ ఉన్నారని అంటున్నారు. వీరి సభలోకి రాకుండా రిజిష్టర్ లో సంతకాలు చేశారని ప్రచారం సాగుతోంది.
అయితే దీని మీద స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలే కాకుండా సభకు రాని వారు రిజిష్టర్ లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్న వారి తీరు మంచిది కాదని అన్నారు. గౌరవంగా సభలోకి రండి గెలిపించిన ప్రజల తరఫున ప్రజా సమస్యలు ప్రస్తావించండి అని ఆయన కోరుతున్నారు.
మరి వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది చర్చగా ఉంది. ఒక విధంగా చూస్తే కనుక వారు అధినాయకత్వం నిర్ణయానికి ఓకే చెప్పలేక అలాగని కాదనలేక మధ్యలో నలిగిపోతున్నారా అని కూడా అంటున్నారు. నిజానికి రెండు లక్షల మంది ప్రజల తరఫున ప్రతినిధిగా ఎమ్మెల్యే ఉంటారు.
వారి సభలో అధ్యక్షా అని అనాలని కోరుకుంటారు. తమ ప్రాంతం సమస్యలను సభలో ప్రస్తావించి ప్రజల మన్ననలు పొందాలని చూస్తారు. ఒక విధంగా వారి పొలిటికల్ కెరీర్ కూడా ఇక్కడ ముడిపడి ఉంది. మరి వారిని సభకు రాకుండా చేయడం మంచిది కాదని అంటున్నారు. అధినాయకుడు జగన్ సభకు రాకపోయినా పులివెందులలో ఆయన గెలుపునకు ఢోకా లేదు కానీ ఇతర సభ్యులు అలా కాదు, వారు ప్రజా సమస్యలను ప్రస్తావించమాని చెప్ప్కోవాలి. ప్రజల కోసం పనిచేశామని అనిపించుకోవాలి. లేకపోతే వారి రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది.
మరి ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం ఆలోచించాలని అంటున్నారు. జగన్ సభకు రాకపోయినా తమ పార్టీ వారిని సభకు పంపించి వారి వాణిని ప్రజలకు వినేలా చేయాలని అంటున్నారు. దీని వల్ల వైసీపీకి మేలే తప్ప మరేమీ జరగదని అంటున్నారు. మరి ఏడుగురు ఎమ్మెల్యేల విషయం చూసి అయినా వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తుందా అన్నదే అంతా చర్చిస్తున్నారు.