'సీట్లు' పెరుగుతున్నాయ్.. పాట్లు తప్పుతాయా..?
బీజేపీ, కాంగ్రెస్, జనసేన ల పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
By: Tupaki Desk | 29 Jun 2024 11:30 AM GMTవచ్చే 2029 నాటికి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఇలానే ఉండదు. ప్రస్తుతం చాలా మందికి సీట్లు దక్కలేదు. ఆ పార్టీ .. ఈ పార్టీ అని తేడా లేకుండా.. అన్ని ప్రధాన పార్టీలదీ ఒకే తీరు. అయితే.. కొన్ని కొన్ని పార్టీలకు మాత్రం సీట్లు ఉన్నా.. నాయకులు లేని దుస్థితి వెంటాడింది. దీంతో పొరుగు పార్టీల నుంచి నాయకులను తెచ్చుకుని సీట్లు పంచాల్సి వచ్చింది. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక, వైసీపీ, టీడీపీల్లో నాయకులు ఎక్కువ.. సీట్లు తక్కువ అనే మాట వినిపించింది.
దీంతో బీజేపీ, జనసేనలు మాత్రం పొరుగు పార్టీల నుంచి నాయకులను తీసుకుని సీట్లు సర్దు బాటు చేయాల్సి వచ్చింది. అయితే.. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి సీట్లు మరిన్ని పెరగనున్నాయి. ఈ పరిణామం.. టీడీపీ, వైసీపీకి పాలు పోసినట్టు అవతుంది. కానీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన ల పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఈ ఐదేళ్లలో జరగనుంది. 2029 ఎన్నికల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరుగుతాయి.
ఈ క్రమంలో కనీసం 50 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. జనసేన పార్టీకి అభ్యర్థుల కొరత ఉంటుంది. నిజానికి ఇప్పటికీ జనసేన పార్టీకి పెద్దగా నేతలు లేరు. అందుకే గత ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ నేతల్ని చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అవకాశాల్ని ముందుగా అందిపుచ్చుకోవడానికి చాలా మంది రెడీ అవుతున్నారు. వచ్చే ఒకటి, రెండు నెలల్లో .. జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉండే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.
ఇక, బీజేపీ కూడా సీట్ల పెరిగితే ఏం చేయాలన్న దిశగా ఆలోచన చేస్తున్నా.. ఇప్పటి వరకు అయితే.. అలాంటి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం లేదు. ఇక, కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారుతోంది. షర్మిల నాయకత్వాన్ని మెజారిటీ నాయకులు ఒప్పుకోవడం లేదు. దీంతో పార్టీ మనుగడపైనే ప్రశ్నలు వస్తున్నాయి. అదేసమయంలో వైసీపీ పుంజుకుంటుందా? ఇలానే ఉంటుందా? అనేది జగన్ వేసే అడుగులను బట్టిఆధారపడి ఉంటుందని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.