Begin typing your search above and press return to search.

బాబు మరో బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Sep 2023 9:14 AM GMT
బాబు మరో బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తరుపు న్యాయవాదులు దాఖలు చేస్తున్న పిటిషన్ లు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇందులో భాగంగా పలు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో తాజాగా మరో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా వాయిదా పడింది.

అవును... స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో 19 లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ పిటిషన్ పై స్పందించిన నాయమూర్తి... హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌ లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.

అక్కడ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో... మధ్యంతర బెయిల్‌ పై విచారిస్తే క్వాష్‌ పిటిషన్‌ పై ప్రభావం పడుతుందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో క్వాష్ పిటిషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోని ముందస్తు బెయిల్ పిటిషన్, పుంగనూరు అల్లర్ల కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ ల సరసన తాజాగా ఈ పిటిషన్ కూడా చేరినట్లయ్యిందని అంటున్నారు.

కాగా... ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదుచేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తన పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసిందని ఆ పిటిషన్‌ లో పేర్కొన్నారు.

ఇదే క్రమంలో... ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు లేదని.. కేసులో తన పేరు ఎప్పుడు చేర్చారో కనీసం చెప్పలేదని.. ఎఫ్.ఐ.ఆర్. లోనూ తన పేరు లేదని.. ఏ ఆధారాలతో తనను నిందితుడిగా చేర్చారో చెప్పేందుకు సీఐడీ వద్ద ప్రాథమిక వివరాలు లేవని.. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తనను ఇరికించారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇదే సమయలో ఏపీ ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే తనను ఇరికించారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇదే విషయాన్ని పిటిషన్ లో పొందుపరిచారు. ఫలితంగా... ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు. దీంతో ఈ పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్టు... విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.