Begin typing your search above and press return to search.

BREAKING: SLBC టన్నెల్ లో విషాదం: ఇంజినీర్ మృతదేహం గుర్తింపు

రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   9 March 2025 1:06 PM IST
BREAKING: SLBC టన్నెల్ లో విషాదం: ఇంజినీర్ మృతదేహం గుర్తింపు
X

రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెస్క్యూ సిబ్బంది టన్నెల్ లోని టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) ముందు భాగంలో ఓ మృతదేహాన్ని గుర్తించారు.

మృతదేహానికి కుడి చేయి, ఎడమ కాలు మాత్రమే కనిపించగా, చేతికి ఉన్న కడియాన్ని బట్టి అతను ఇంజినీర్ గుర్దిప్రీత్ సింగ్ గా గుర్తిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అతడి మృతదేహాన్ని సాయంత్రం నాటికి పూర్తిగా వెలికి తీసే పనులు జరుగుతున్నాయి.

- మరిన్ని మృతదేహాల అనుమానం

రెస్క్యూ బృందం ఇంకా అన్వేషణ కొనసాగిస్తుండగా, టన్నెల్ లో మరిన్ని మృతదేహాలు చిక్కుకొని ఉండే అవకాశముందని భావిస్తున్నారు. టీబీఎం మెషీన్ చుట్టుపక్కల శీఘ్రంగా శోధన చర్యలు చేపట్టారు.

- కొనసాగుతున్న రక్షణ చర్యలు

ఈ ప్రమాదానికి గల కారణాలపై పరిశీలన జరుగుతున్నప్పటికీ, ప్రాణ నష్టం మరింత పెరగకూడదనే దృష్టితో అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. అధికారుల ప్రకారం, పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ కూలిన ఘటన విషాదకరంగా మారింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వ బలగాలు, రెస్క్యూ మేనేజ్మెంట్లు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు స్పష్టమైన ఆచూకీ లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి బృందాలు, కేంద్ర బలగాలను రంగంలోకి దింపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంగా కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌ను రప్పించారు. బెల్జియన్ మాలినోస్ జాతికి చెందిన ఈ కుక్కలు 15 మీటర్ల లోతులో ఉన్న మనుషుల అవశేషాలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ప్రమాద స్థలానికి 100 మీటర్ల దూరంలోని డీ-2 పాయింట్‌లో ఈ కుక్కలు మనుషుల ఆనవాళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒక మృతదేహం బయటపడడంతో అంతటా విషాదం నెలకొంది.