Begin typing your search above and press return to search.

‘స్లీప్ డివోర్స్’..ఇదేం ట్రెండ్ రా బాబూ!

నేటి కంప్యూటర్ యుగంలో పగలు, రాత్రి తేడా లేకుండా ఉద్యోగాల షిష్ట్ లు ఉంటున్నాయి.

By:  Tupaki Desk   |   6 March 2025 10:00 PM IST
‘స్లీప్ డివోర్స్’..ఇదేం ట్రెండ్ రా బాబూ!
X

వెనకటి కాలంలో దాదాపు అంతా గ్రామీణ జీవన విధానమే ఉండేది. వ్యవసాయం, కూలీ పనులే కాదు, ఇతర ఉద్యోగాలు కూడా పగటి పూటే ఉండేవి. పొద్దంతా పనిచేసి రాత్రి ఏడు, ఎనిమిది గంటల కల్లా మంచం చేరేవారు. పొద్దంతా పనిచేసి అలసిపోయి ఉంటారు కనుక పడుకోవడంతో నిద్ర పట్టేది. ఎలాంటి అంతరాయం లేకుండా 8-10 గంటలు గాఢ నిద్ర పోయేవారు. దీంతో వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి కావు. నిద్రలేమి సమస్యతో వచ్చే జబ్బులు వచ్చేవి కావు. దీంతో పగటి పూట వారు తమ తమ పనుల్లో మరింత శ్రమపడేవారు.

నేటి కంప్యూటర్ యుగంలో పగలు, రాత్రి తేడా లేకుండా ఉద్యోగాల షిష్ట్ లు ఉంటున్నాయి. పగటి వేళ కంటే రాత్రివేళ పనిచేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మనుషుల జీవగడియారంలో తేడాలు వస్తున్నాయి. చాలా మందిలో నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి. ఇవి ఇతర జబ్బులను మోసుకొస్తున్నాయి. నిద్ర సరిగ్గా లేకపోవడంతో తాము చేస్తున్న పనిపై సరిగ్గా దృష్టిపెట్టలేకపోతున్నారు. అలాగే నేటి కాలంలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి వేర్వేరు షిఫ్ట్ ల్లో పనిచేస్తుండడం కూడా కొత్త సమస్యలను తీసుకొస్తున్నాయి. నేటి తరం ఉద్యోగాలకు నిద్ర ఓ అవసరమైపోయింది. మంచి నిద్ర కోసం తహతహలాడుతున్నారు. దీనికోసం ఎంతో మంది ‘స్లీప్ డీవోర్స్’అనే కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.

అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో కొన్ని జంటలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశాలే కాకుండా భారత్ లోనూ ఆ ట్రెండ్ వచ్చేసింది. ఇంతకీ స్లీప్ డీవోర్స్ అంటే ఏంటంటే.. మంచి నిద్ర కోసం దంపతులిద్దరు వేర్వేరుగా నిద్రించడం. ఉదాహరణకు భార్య డే షిఫ్ట్, భర్త నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరూ వారాంతాల్లో మాత్రమే ఒకరికొకరు నాణ్యమైన సమయాన్ని ఇవ్వగలుగుతారు. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరూ విశ్రాంతి తీసుకునేందుకు వారానికి 5 రోజులు స్లీప్ డీవోర్స్ విధానాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అలాగే రాత్రివేళ ఇద్దరు ఇంటి దగ్గర ఉన్న కూడా ఇద్దరిలో ఎవరో ఒకరికి గురక అలవాటు ఉన్న ఇలాగే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రాత్రులు ప్రశాంతంగా నిద్రించడానికి, ఒకరికొకరు భంగం కలిగించకుండా ఉండటానికి ఉపయోగపడుతుందంటున్నారు.

స్లీప్ డీవోర్స్ వల్ల దంపతుల నిద్ర నాణ్యత మెరుగుపడి జంటలు వ్యక్తిగత స్వేచ్ఛను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఇది రోజువారీ కార్యక్రమాలను ఒత్తిడి, చికాకులు లేకుండా చేసుకోవచ్చని అంటున్నారు. గ్లోబల్ పీస్ సర్వే అనే సంస్థ ‘స్లీప్ డివోర్స్’పై తాజా ఓ నివేదికను వెల్లడించింది. దీనిలో భారత దేశం అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. ఇక్కడ 78శాతం జంటలు విడివిడిగా పడుకుంటున్నాయని తేల్చారు. తర్వాతి స్థానాల్లో చైనా-67శాతం, సౌత్ కొరియా-65శాతం, అమెరికా, బ్రిటన్-50శాతం జంటలు వేర్వేరుగా పడుకుంటున్నారట.

అయితే ఈ ట్రెండ్ పై కొందరు పెదవి విరుస్తున్నారు. ఇదెక్కడి ట్రెండ్ రా బాబూ అంటున్నారు. దంపతులు కలిపి పడుకోవడం వల్ల వారిలో అన్యోన్యత పెరుగుతుంది..ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం దక్కుతుంది. రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటివి పోవడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా వారి వారి విధులను చేసుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య ఆలుమగల బంధం మరింత దృఢంగా మారి వారి జీవితం సుఖమయం అవుతుంది అంటున్నారు. కానీ స్లీప్ డివోర్స్ వంటి సిద్ధాంతాల వల్ల భార్యాభర్తల బాండింగ్ తగ్గి కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయంటున్నారు. ఇద్దరు కలిసి పడుకోవడం వల్ల వారిలో ప్రేమ మరింత పెరిగి..ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల ఒకరి నిద్రకు మరొకరు ఆటంకం కలుజేయాలని అనుకోరు. కాసేపు అలా మాట్లాడుకుని పడుకోవడం వల్ల హాయిగా గాఢనిద్రలోకి జారిపోవచ్చని సూచిస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ తో నాణ్యమైన నిద్ర మాట ఏమోగాని కలహాలు ఎక్కువ కావొచ్చని కూడా అంటున్నారు.