స్లీప్ స్కోర్ కార్డు 2024 చెప్పిన వివరాలు ఇవే
ఉరుకులు పరుగులు తీసే నగర జీవనం కంటి నిండా కునుకు కూడా లేకుండా చేస్తుందంటుంది
By: Tupaki Desk | 22 March 2024 4:34 AM GMTఉరుకులు పరుగులు తీసే నగర జీవనం కంటి నిండా కునుకు కూడా లేకుండా చేస్తుందంటుంది. సరైన నిద్ర.. సరైన ఆహారం లేని జీవితాలు నిద్ర లేమి సమస్యతో ఇబ్బందులు పడుతుంటాయి. దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డు 2024. వేక్ ఫిట్ సంస్థ నిర్వహించిన ఈ సర్వే వివరాల్ని చూస్తే బోలెడన్ని అంశాలు తెలుస్తాయి.
నగరవాసుల్లో దాదాపు 56 శాతం మంది నిద్రలేమితో సతమతమవుతున్నట్లుగా పేర్కొంది. దీంతో పని వేళల్లో నిద్రమత్తుతో బద్ధకంగా ఉంటారని పేర్కొంది. 91 శాతం మంది నిద్ర పోవటానికి ముందు సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్లుగా చెప్పింది. నగరవాసుల్లో 36 శాతం మంది రాత్రి11 గంటల తర్వాతే నిద్రకు తెర తీస్తున్నారని.. 33 శాతం మందికి ఇన్ సోమ్నియాతో ఇబ్బంది పడుతున్నట్లుగా పేర్కొంది.
షిప్టుల్లో పని చేయటంతో నిద్రలేమి సమస్య ఉందని 32 శాతం మంది పేర్కొంటే.. అందుకు పరిష్కారంగా నిద్ర పోయే ప్రాంతంలో వాతావరణం అనువుగా ఉండాలని 59 శాతం మంది పేర్కొన్నారు. సెల్ ఫోన్ ను దూరంగా పెట్టటమే పరిష్కారమని 41 శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి నలుగురిలో ఒకరు నిద్ర లేమి సమస్యతో బాధ పడుతున్నట్లుగా గుర్తించారు. నిద్ర లేమి సమస్యకు చెక్ చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు.. నిద్ర పోయే ప్రాంతాన్ని శుభ్రంగా.. ఆహ్లాదకరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.