Begin typing your search above and press return to search.

చిన్న పార్టీలు.. చిత్రమైన పేర్లు.. పోటీలో ప్రత్యేకం

రోడ్ రోలర్.. బీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉందని ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గో వధకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పార్టీ యుగ తులసి.

By:  Tupaki Desk   |   24 Nov 2023 5:30 PM GMT
చిన్న పార్టీలు.. చిత్రమైన పేర్లు.. పోటీలో ప్రత్యేకం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొన్ని చిన్న పార్టీలు చిత్రమైన పేర్లున్న పార్టీలు బరిలో నిలిచాయి. వీటి వ్యవస్థాపకులు ఒకచోట ఉంటే.. వారి అభ్యర్థులు మరోచోట పోటీ చేస్తున్నారు. వీటిలో ఓ పార్టీ అయితే, గతంలో ఒకటీ రెండు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచింది. మిగతా పక్షాలన్నీ పేరుకు అన్నట్లు ఉన్నాయి. అయితే , వీటిలో కొన్నింటి పేర్లు మాత్రం చాలా చిత్రంగా అనిపిస్తాయి. అలాంటివాటిలో ఒకటి ‘‘యుగతులసి’’. మునుగోడు ఉప ఎన్నికలో రోడ్ రోలర్ గుర్తుపొందింది ఈ పార్టీ. రోడ్ రోలర్.. బీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉందని ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గో వధకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పార్టీ యుగ తులసి. అలాంటి ఈ పార్టీకి గుర్తుగా రోడ్డు రోలర్ వస్తుండడంతో బీఆఎస్ కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్లింది.

ఈ పేర్లు చిత్రమే..

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరికొన్ని పార్టీల పేర్లు చూస్తే.. ప్రజావాణి, దళిత బహుజన, ధర్మసమాజ్‌, గోండ్వానా దండకారణ్య, భారత చైతన్య యువజన, భారతీయ స్వదేశీ కాంగ్రెస్‌. ఇవి ఈ ఎన్నికల సమయంలోనే తెరపైకి వచ్చే పార్టీలు. బహుజన ముక్తి, సకలజనుల, అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌, ప్రజారాజ్య సమితి, తెలంగాణ రాజ్య సమితి, ఆల్‌ ఇండియా మహిళా ఎంపవర్‌మెంట్‌, న్యూఇండియా, ఇండియా ప్రజాబంధు, నవభారత నిర్మాణ సేన వంటివి కూడా బరిలో ఉన్నాయి. వీటి అభ్యర్థులు ప్రచారం కూడా చేస్తున్నారు.

బీఎస్పీ ప్రభావం..

రెండేళ్ల కిందట బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. ఓ ఐపీఎస్ అధికారిగా ఉన్నత హోదాలో పనిచేసిన అనుభవం, స్వేరో కార్యక్రమాలు, బహుజనవాదం, గురుకుల సంస్థల కార్యదర్శిగా తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ఆయన బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శిగానూ ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమయ్యాయి. ఈ ఎన్నికల్లో 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. సిర్పూరులో స్వయంగా ప్రవీణ్‌కుమార్‌ బరిలో దిగి గెలుపుపై ధీమాగా ఉన్నారు. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ లో బీఎస్పీ 2014లో రెండు సీట్లు నెగ్గింది. నిర్మల్‌ లో ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూరులో కోనేరు కోనప్ప నాడు గెలిచారు. ఆ తర్వాత వీరు బీఆర్ఎస్ లో చేరారు.

సమాజ్ వాదీ పార్టీ..

ఉత్తరప్రదేశ్ లో బలమైన పార్టీ సమాజ్ వాదీ. అయితే, ఈ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఓ సీటు గెలిచిందనే సంగతి తెలుసా? 2004లో గద్వాల నుంచి డీకే అరుణ సమాజ్‌ వాదీ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌ లో చేరారు. ఇక అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి మెట్‌పల్లిలో కొమిరెడ్డి రాములు, మెదక్‌ నుంచి పట్లోళ్ల శశిధర్‌ రెడ్డి నెగ్గారు. అయితే ,నాడు వీరంతా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు. కాంగ్రెస్ ప్రభావం బలంగా ఉండడంతో వీరి గెలుపు సాధ్యమైంది.

ఫార్వర్డ్ బ్లాక్ ఫ్రంట్ లైన్

మనకు తెలిసిన కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ. కానీ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ కూడా వామపక్షమే. దీని గుర్తు కూడా అందరికీ తెలిసిన సింహం గుర్తు కావడం విశేషం. ప్రధాన పార్టీల్లో టికెట్‌ దొరకనివారు దీనిపై పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్లుగా కంటే ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీల గుర్తు కలిసి వస్తుందన్నదే వారి అభిప్రాయం. ప్రస్తుతం ఫార్వర్డ్‌ బ్లాక్‌ 40 స్థానాల్లో బరిలో ఉంది. 12 స్థానాల్లో ప్రభావం చూపుతామంటోంది. కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ తరఫునే పోటీ చేస్తున్నారు. ఇంకో విశేషం ఏమంటే.. వనపర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మేఘారెడ్డి మొదట ఫార్వర్డ్ బ్లాక్ బీ-ఫాం తీసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ టికెట్ రావడంతో వెనక్కుతగ్గారు. కాగా, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా 2018లో రామగుండం నుంచి కోరుకంటి చందర్‌ గెలుపొందారు. అంటే అసెంబ్లీలో ఆ పార్టీ బోణీ చేసింది. చందర్ ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు.