వ్యక్తి కడుపులో తాళాలూ, తాయత్తులు...ఏందయ్యా ఇదే?
ఓ వ్యక్తి గతకొన్ని రోజులుగా కడుపునొప్పితో బాదపడుతున్నాడు. ఏవో టాబ్లెట్స్ వేసుకుంటున్నా ఉపశమనం రాకపోయే సరికి కాస్త పెద్దాసుపత్రికి వెళ్లాడు.
By: Tupaki Desk | 29 Sep 2023 10:01 AM GMTఓ వ్యక్తి గతకొన్ని రోజులుగా కడుపునొప్పితో బాదపడుతున్నాడు. ఏవో టాబ్లెట్స్ వేసుకుంటున్నా ఉపశమనం రాకపోయే సరికి కాస్త పెద్దాసుపత్రికి వెళ్లాడు. కారణం పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించిన వైద్యులు స్కానింగ్ చేసి పరీక్షించారు. ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాకయ్యారు. కారణం... ఆ వ్యక్తి కడుపులో చిన్న సైజు స్టోరే ఉంది!
అవును... పంజాబ్ లోని మోగా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్తే, స్కానింగ్ చేసిన వైద్యులు అవాక్కయ్యారు. వ్యక్తి కడుపులో చాలా సామాన్ల లిస్టే ఉంది. అందులో భాగంగా... ఇయర్ ఫోన్స్, లాకేట్స్, బోల్టులు, తాళం చెవులు, సేఫ్టీ పిన్నులు, జిప్ ట్య్యాగ్ లు, వైర్లు, రాఖీలు, తాయత్తులు, గవ్వలు, నట్లు ఇలా వందకు పైగా వస్తువులు కనిపించాయంట.
దీంతో షాకైన వైద్యులు ఆపరేషన్ చేయాలని ఫిక్సయారు. అనంతరం సుమారు మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేశారు. అతడి శరీరంలోని వస్తువులను విజయవంతంగా బయటకు తీశారు. అనంతరం ఆ వస్తువులన్నింటినీ ఒక చోట ఉంచారు. ప్రస్తుతం ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది కడుపా, స్టోరా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఇక సర్జరీ అనంతరం స్పందించిన వైద్యులు... తమ కెరీర్ లో ఇలాంటి కేసు గతంలో ఎన్నడూ చూడలేదని, ఇదే మొదటిదని చెబుతున్నారు. సుమారు రెండు ఏళ్లుగా ఈ వస్తువులు బాధితుడి కడుపులోనే ఉన్నాయని అన్నారు. దీంతో ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు అవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి కడుపులోంచి అన్ని వస్తువులన్నీ తీసేసినప్పటికీ.. అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడలేదని చెప్పారు.
అనంతరం ఈ విషయంపై ఆ వక్తి కుటుంబ సభ్యులు స్పందించారు. కడుపులో అన్ని వస్తువులు ఉండటం తెలిసి తాము కూడా షాక్ అయ్యామని చెప్పారు. అవన్నీంటిని అతడు ఎలా, ఎప్పుడు మింగాడో తమకు తెలీదని అన్నారు. 40 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు!