ఫోన్లు కొట్టేసి సూడాన్ కు.. కేటుగాళ్లను పట్టేసిన హైదరాబాద్ పోలీసులు
తాము దొంగలించిన ఫోన్లను జగదీశ్ మార్కెట్ లోని కొందరు వ్యాపారులకు అమ్ముతున్నారు. వాటికికొన్ని రిపేర్లు చేసి.. వాటిని ఐదుగురుతోకూడిన సూడాన్ ముఠాకు అమ్ముతున్నారు.
By: Tupaki Desk | 27 April 2024 8:30 AM GMTషాకింగ్ స్మగ్లింగ్ వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. హైదరాబాద్ మహానగర పోలీసుల దెబ్బకు అంతర్జాతీయ నేరస్తుల ముఠాకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. రోడ్ల మీద సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్లే వారి ఫోన్లను కొట్టేసే ఉదంతాల గురించి విని ఉంటాం. అయితే..దీని వెనుక అంతర్జాతీయ స్థాయిలో స్కెచ్ ఒకటి ఉందన్న విషయాన్ని తాజాగా వెలుగు చూసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తాజాగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఈ ఇంటర్నేషనల్ క్రైం స్టోరీ గురించి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద వెళ్లే వారి నుంచి సెల్ ఫోన్లు కొట్టేసే ఒక ముఠా.. దానికి సంబంధించిన పన్నెండు మంది సభ్యుల్ని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు సూడాన్ దేశస్తులు ఉండటం గమనార్హం. అంతేకాదు వీరి నుంచి 703 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.75 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఇటీవల సిటీలో సెల్ ఫోన్ దొంగతనాలు ఎక్కువ కావటం.. గాయపరిచి మరీ సెల్ ఫోన్ తీసుకెళ్లిపోతున్న తీరు ఈమధ్యన ఎక్కువైంది. సెల్ ఫోన్ల కోసం గాయపర్చేందుకు సైతం వెనుకాడని తీరుపై సందేహానికి గురైన హైదరాబాద్ సీపీ ఈ అంశంపై ఫోకస్ పెట్టాలంటూ స్పెషల్ టాస్క్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా తాడ్ బండ్ కు చెందిన 19 ఏళ్ల మహ్మద్.. 19 ఏళ్ల అబ్రార్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా..సెల్ ఫోన్ స్మగ్లింగ్ ముఠా లింకులు బయటకు వచ్చాయి.
తాము దొంగలించిన ఫోన్లను జగదీశ్ మార్కెట్ లోని కొందరు వ్యాపారులకు అమ్ముతున్నారు. వాటికికొన్ని రిపేర్లు చేసి.. వాటిని ఐదుగురుతోకూడిన సూడాన్ ముఠాకు అమ్ముతున్నారు. వారు. ఈ సెల్ ఫోన్లను సూడాన్ కు స్మగ్లింగ్ చేస్తున్నారు.
ఇప్పటికే వేలాది ఫోన్లను సూడాన్ కు తరలించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదువుకోవటానికి భారత్ కు వచ్చిన వీరు అక్రమంగా బంజారాహిల్స్ ప్రాంతంలో ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఈ ఉదంతంలో మరో కోణాన్ని వెలికి తీశారు. కొందరు విదేశీయులు ఐఫోన్లు కొనుగోలు చేసి.. వాటిని తాము పోగొట్టుకుంటున్నట్లుగా తప్పుడు క్లెయిమ్ చేస్తారు. ఆ ఫోన్లను ఇండియాకు తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్ముతున్న వైనాన్ని గుర్తించారు. ఇలాంటి వాటిని కొనొద్దని పోలీసులు సూచన చేస్తున్నారు.