ఏపీలో ఆమ్రపాలి.. తెలంగాణలో స్మితా.. వీరిపైనే ఇప్పుడు చర్చ అంతా..!
స్మితా, ఆమ్రపాలి ఇద్దరు కూడా డైనమిక్ ఆఫీసర్లు అనే పేరు ఉంది. నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
By: Tupaki Desk | 12 Nov 2024 2:30 PM GMTతెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 13 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మితా సబర్వాల్‌కు కీలక పోస్టు దక్కింది. సేమ్ అదే పోస్ట్ ఏపీలో ఆమ్రపాలికి దక్కడంతో ఇప్పుడు వీరిద్దరిపైనే చర్చ నడుస్తోంది.
ఇన్ని రోజులు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్మాల్ కొనసాగారు. అయితే.. తాజా బదిలీల్లో భాగంగా ఆమెకు యువజన సర్వీసులు, టూరిజం అండ్ కల్చరల్ సెక్రటరీగా నియమించారు. ఏపీలోనూ ఏపీ టూరిజం అథారిటీ సీఈఓగా ఆమ్రపాలికి బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరికి వేర్వేరు రాష్ట్రాల్లో సేమ్ పోస్టులు ఇవ్వడంపైనే ఇరు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతున్నది.
స్మితా, ఆమ్రపాలి ఇద్దరు కూడా డైనమిక్ ఆఫీసర్లు అనే పేరు ఉంది. నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా కీలక బాధ్యతల్లో కొనసాగారు. ఆ ప్రభుత్వం ఆమెకి పెద్దపీట వేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రచారం ఉంది. కేంద్ర సర్వీసులో ఉన్న ఆమ్రపాలిని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి రప్పించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌తోపాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. అయితే..ఈ ఇద్దరు ఆఫీసర్లు కూడా ఎక్కడ పనిచేసినా తమ దైన మార్క్ చూపిస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
స్మితా సబర్వాల్ 2001 సివిల్ సర్వీసెస్ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె వివిధ జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. ముఖ్యంగా మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీంలోకి ఆమెను తీసుకున్నారు. ఏకంగా సీఎం సెక్రటరీగా స్మితాను అపాయింట్ చేశారు. దాంతో ఆమె సుదీర్ఘ కాలం పాటు ఆ పోస్టులో కొనసాగారు. చెప్పాలంటే పదేళ్ల పాటు ఆమె అదే పోస్టులో ఉన్నారు. అప్పటికే జిల్లాల్లో పనిచేసిన సందర్భంలోనే ఆమెకు ప్రజల్లో అభిమానం ఎక్కువగా ఉండేది. ఆమె అమలు చేసిన పథకాలకు, ఆమె నిర్ణయాలకు జిల్లాల వారీగా అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రేవంత్ సర్కార్ వచ్చాక ఆమెను ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించారు.
ఇక.. ఆమ్రపాలి సైతం అంతకుముందు తెలంగాణలో వర్క్ చేశారు. వరంగల్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో కలెక్టర్‌గా కొనసాగారు. ఆమె కూడా వర్క్ చేసిన ప్రతి జిల్లాల్లోనూ తన ప్రతిభ చాటారు. ప్రత్యేక గుర్తింపు పొందారు. కలెక్టర్‌గా కొనసాగుతూనే ట్రెక్కింగులకు వెళ్లడం, ట్రెండీ థింగ్స్‌తో ట్రెండింగ్ ఆఫీసర్‌గా పేరు పొందారు. ఆ తరువాత జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమెను ఏపీకి కేటాయించారు. దీంతో తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఆమె ఏపీలో జాయిన్ కావాల్సి వచ్చింది. ఇద్దరు ఆఫీసర్లు కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారే. ఇద్దరికి కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే.. ఇప్పుడు అనుకోకుండా ఇద్దరికీ సేమ్ హోదా.. సేమ్ పోస్ట్ రావడంపై వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇరు రాష్ట్రాల్లో సేమ్ బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఎలాంటి మార్పును తీసుకొస్తారని ఆసక్తి కూడా నెలకొంది. వీరి పాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ జరుగుతున్నది.