తెలియదు.. గుర్తులేదు.. కాళేశ్వరంలో ' స్మిత ' సినిమా డైలాగ్
తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాల విషయంలో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వైఖరి కూడా ఇంతే ఉంది.
By: Tupaki Desk | 20 Dec 2024 8:00 AM GMTఆ మధ్య వచ్చిన ఓ సినిమాలో హీరో క్యారెక్టర్ చెప్పిన ‘‘తెలియదు.. గుర్తులేదు..’’ అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అన్నీ తెలిసి కూదా ఆ హీరో చెప్పిన ఈ డైలాగ్ ను తర్వాత సోషల్ మీడియ వచ్చాక అనేక సందర్భాల్లో వినియోగించడం మొదలుపెట్టారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాల విషయంలో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వైఖరి కూడా ఇంతే ఉంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరంపై విచారణకు న్యాయ కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కారు హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు సరిగ్గా గత ఏడాది ఎన్నికల సమయంలో కుంగింది. దీంతోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు వచ్చాక విచారణ కమిషన్ వేసింది.
అయితే, స్మితా సబర్వాల్ గతంలో సీఎం (కేసీఆర్) కార్యదర్శిగా పనిచేయడంతో ఆమెను కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచింది. తెలంగాణలో ఆమె ప్రస్తుతం యువజన సంక్షేమం, పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఇక కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ పలు అంశాలపై ప్రశ్నించారు.
సీఎం కార్యదర్శిగా ఎప్పుడు పనిచేశారు... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రతిపాదనలన్నీ మంత్రివర్గం ముందు ఉంచారా? అని అడిగారు.
తెలంగాణ ఏర్పడిన మూడు రోజులకు.. అంటే 2014 జూన్ 5 నుంచి కేసీఆర్ సీఎంగా ఉన్న వరకు ఆయన కార్యదర్శిగా పనిచేశారు స్మిత. కాగా, కాళేశ్వరంపై అన్ని ప్రతిపాదనలను మంత్రివర్గం ముందు ఉంచాననే అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
ఇక ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె తెలియదు.. ఆ ఫైల్ నా వద్దకు రాలేదు.. అని జవాబిచ్చారు.