Begin typing your search above and press return to search.

స్మితా సబర్వాల్‍ కామెంట్స్‌ పై సీతక్క, జవహార్ ఫైర్... సారీ చెప్పాల్సిందే!

ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అంటూ ఆమే సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

By:  Tupaki Desk   |   23 July 2024 6:46 AM GMT
స్మితా సబర్వాల్‍  కామెంట్స్‌  పై సీతక్క, జవహార్  ఫైర్... సారీ చెప్పాల్సిందే!
X

సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అంటూ ఆమే సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క.. టీడీపీ నేత, మాజీమంత్రి కేఎస్ జవహార్ లు మండిపడ్డారు.

అవును... ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అని అంటూ స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆమె క్షమాపణ చెప్పాలని దివ్యాంగులు, సీనియర్ అధికారులు, పలువురు విజ్ఞులు డిమాండ్ చేస్తున్నారు. బ్యూరోక్రాట్లకు ఫిజికల్ ఫిట్ నెస్ కంటే మెంటల్ ఫిట్ నెస్ ముఖ్యమంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఆమె మానసిక స్థితిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు తెలంగాణ మంత్రి సీతక్క ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... ఐఏఎస్ అధికారులు అంటే బాధ్యతగా ఉండాలని స్మితా సబర్వాల్ కు సూచించారు. ఉన్నతాధికారి హోదాలో ఉండి, దివ్యాంగులపై ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని సూచిస్తూ.. వైకల్యాన్ని కించపరచవద్దని చెప్పారు. ఇదే క్రమంలో... ఇలాంటి వ్యాఖ్యలు చేసి వాళ్లు తమ బుద్ది వైకల్యాన్ని చూపిస్తున్నారంటూ సీతక్క మండిపడ్డారు.

ఇదే సమయంలో... దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీనియర్ టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి కేఎస్ జవహార్ స్పందించారు. ఇందులో భాగంగా ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇలాంటి వారు ప్రభుత్వ పదవుల్లో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానిస్తూ.. ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు జవహార్.

ఇందులో భాగంగా... స్మితా సబర్వాల్ కి చదివేస్తే ఉన్న మతిపోయినట్లు ఉందని.. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతరాహిత్యంతో కూడుకున్నవని.. సమాజం పట్ల అవగాహన లేని వ్యాఖ్యలు అని దుయ్యబట్టారు. ఈమె వ్యవహారం చూస్తుంటే... చివరకు రిజర్వేషన్లు కూడా తీసేయాలని ఉద్యమం చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు! ఇదే క్రమంలో... అంబేద్కర్ ఆలోచన, రాజ్యాంగం పట్ల అవగాహన లేనివారు సివిల్ సర్వెంట్లుగా పనికిరారని ఆయన ఘాటుగా స్పందించారు.

దివ్యాంగులపై ఆమెకు ఇంత చులకన భావం ఎందుకువచ్చిందని ప్రశ్నించిన ఆయన... దీని వెనుక ఎవరున్నారో చెప్పాలని కోరారు. ఇలాంటి ఆలోచనతో సమాజంలో వైషమ్యాలను పెంచాలనుకోవడం దుర్మార్గమని నొక్కి చెప్పారు. ఇలాంటి అహంకారులకు బుద్దిచెప్పాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే.. ఆమె కచ్చితంగా క్షమాపణ చెప్పాలని, చెప్పకపోతే ఊరుకునేది లేదని జవహార్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.

మరోపక్క దివ్యాంగులకు రిజర్వేషన్ అంశంపై స్మితా సబర్వాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.. తెలంగాణ కాంగ్రెస్ సస్పెండెడ్ నేత బక్క జడ్సన్. ఇదే సమయంలో... శాంతి దివ్యాంగుల సంఘం నాయకురాలు శ్రీగిరి రజనీ... ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రేవంత్ కూడా ఈ వ్యవహారంపై స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు!!