Begin typing your search above and press return to search.

రాహుల్‌ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి అవమానం!

స్మృతి ఇరానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఢిల్లీలో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   1 July 2024 4:30 PM GMT
రాహుల్‌ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి అవమానం!
X

ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలకు కేంద్రం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎంపీల హోదాలో కేంద్రం కేటాయించిన నివాసాలను జూలై 11 లోపు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ ఎంపీలుగా విజయం సాధించినవారు మినహా ఎన్నికల్లో ఓడినవారంతా బంగ్లాలను ఖాళీ చేయాలని కోరింది.

కేంద్రం ఆదేశాలు జారీ చేసినవారిలో ఇటీవల ఎన్నికల్లో ఓడిన అన్ని పార్టీల ఎంపీలు ఉన్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌ లోని అమేథిలో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ కూడా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

2014లో అమేథిలో రాహుల్‌ గాంధీపై తలపడిన స్మృతి ఇరానీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019లో తిరిగి పోటీ చేసి రాహుల్‌ ను ఓడించారు. అంతేకాకుండా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు.

2014లో రాహుల్‌ గాంధీపై ఓడినప్పుడు కూడా స్మృతి ఇరానీని రాజ్యసభకు ఎంపిక చేసి మరీ ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్‌ లో ఆమెకు చోటిచ్చారు. కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా మోదీ తొలి కేబినెట్‌ లో పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర జౌళి శాఖ మంత్రిగా, కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిగా ఐదేళ్లు పనిచేశారు.

2019లో రాహుల్‌ పై స్మృతి ఇరానీ గెలిచాక మరోసారి కేంద్ర కేబినెట్‌ లో ఆమెకు చోటు దక్కింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ ఉన్నారు.

2024 ఎన్నికల్లో మరోసారి అమేథి నుంచి బరిలోకి దిగిన స్మృతి ఇరానీకి ఓటమి ఎదురైంది. కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోరి లాల్‌ శర్మ చేతిలో ఓడిపోయారు. దీంతో ఆమె మాజీ ఎంపీగా మిగిలిపోయారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిన ఎంపీలు ఢిల్లీలోని అధికారిక నివాసాలను జూలై 11లోపు ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ ఓడిన ఎంపీలకు నోటీసులు జారీ చేసింది.

కాగా విజయం సాధించిన సిట్టింగ్‌ ఎంపీలు గతంలో కేటాయించిన నివాసాల్లో అలాగే కొనసాగనున్నారు. బంగ్లాలను ఖాళీ చేయాల్సిన వారిలో బీజేపీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఓడిన స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, అర్జున్‌ ముండా, రాజీవ్‌ చంద్రశేఖర్, మురళీధరన్, భారతీ పవార్‌ తదితరులు ఉన్నారు.

గతంలో రాహుల్‌ గాంధీని ఓడించి.. కేంద్ర కేబినెట్‌ మంత్రిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన స్మృతి ఇరానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఢిల్లీలో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీన్ని బళ్లు ఓడలవడం, ఓడలు బళ్లు అవ్వడం అంటారంటున్నారు.