పుష్ప చూసొచ్చి బస్సునే ఎత్తుకెళ్లాడు!
రెండు రోజుల క్రితం పుష్ప సినిమా చూస్తున్న రియల్ పుష్పను పోలీసులు అరెస్టు చేస్తే.. తాజాగా మరో పుష్ప ఆ సినిమాను చూసి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లాడు
By: Tupaki Desk | 24 Dec 2024 7:47 AM GMTరెండు రోజుల క్రితం పుష్ప సినిమా చూస్తున్న రియల్ పుష్పను పోలీసులు అరెస్టు చేస్తే.. తాజాగా మరో పుష్ప ఆ సినిమాను చూసి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లాడు. అనకాపల్లి జిల్లా పోలీసు, ఆర్టీసీ అధికారులకు ఝలక్ ఇచ్చిన ఈ పుష్ప స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం...
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాకు చెందిన షాదిక్ బాషా గంజాయి స్మగ్లర్. ఇప్పటికే అతడిపై మూడు కేసులు ఉన్నాయి. విశాఖ ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి స్మగ్లింగ్ చేయడం ఇతడికి అలవాటు. అదే వృత్తి కూడా... ఆదివారం రాత్రి విశాఖ ఏజెన్సీకి వచ్చిన షాదిక్ బాషా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బస్టాండ్ పక్కనే ఉన్న సినిమా థియేటర్లో పుష్ప2 సినిమాకు వెళ్లాడు. రాత్రి సెకండ్ షో చూసొచ్చిన తర్వాత ఆర్టీసీ డిపోలో ఉన్న బస్సుల వద్దకు వెళ్లాడు. తమిళనాడులో బస్సులను నడిపిన అనుభవం ఉండటంతో ఓ బస్సులోకి వెళ్లి రాత్రి 1 గంట వరకు నిద్రపోయాడు. ఆ తర్వాత బస్సులోనే తాళాలు ఉండటం గమనించి ఆర్టీసీ డిపో నుంచి బస్సు తీసుకుని వెళ్లిపోయాడు. అర్థరాత్రి కావడంతో ఎవరూ బస్సు దొంగతనాన్ని గమనించలేదు. తెల్లవారి బస్సు వద్దకు వచ్చిన డ్రైవర్ అక్కడ బస్సు లేకపోవడం చూసి వెంటనే డిపో అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనకాపల్లి, అల్లూరి జిల్లాలోని అన్ని రూట్లో గాలించగా, ఏజెన్సీలోని చింతూరు రోడ్డులో ఓ చోట బస్సు ఆపి నిందితుడు నిద్రపోతున్నట్లు గుర్తించారు. బస్సు వద్దకు చేరుకున్న పోలీసులు బాషాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.