Begin typing your search above and press return to search.

స్వీపర్ పోస్టుకు అంత డిమాండా..? దరఖాస్తు చేసిన వారంతా గ్రాడ్యుయేట్లే..

అందుకే.. ఏ చిన్న పాటి నోటిఫికేషన్ వెలువడినా లక్షల్లో పోటీ కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 7:49 AM GMT
స్వీపర్ పోస్టుకు అంత డిమాండా..? దరఖాస్తు చేసిన వారంతా గ్రాడ్యుయేట్లే..
X

దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నా.. నిరుద్యోగం మాత్రం తగ్గడం లేదు. ఏటా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతుండడం.. ఆ స్థాయిలో ఉద్యోగాల కల్పన లేకపోవడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చుతోంది.

అందుకే.. ఏ చిన్న పాటి నోటిఫికేషన్ వెలువడినా లక్షల్లో పోటీ కనిపిస్తోంది. స్వీపర్ నుంచి సూపర్‌వైజర్ వరకు ఏ ఉద్యోగానికి అయినా లక్షలాది దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే హర్యానా రాష్ట్రంలో కనిపించింది. హర్యానా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులు, పౌరసంస్థల కార్యాలయాలను శుభ్రం చేయడానికి స్వీపర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే. ఎన్ని పోస్టులు అనేది ఎక్కడా పేర్కొనలేదు.

ఈ పోస్టుకు ఎంపికైన వారు బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లు, భవనాల నుంచి చెత్తను శుభ్రం చేయడం, తొలగించడం వంటివి చేయాల్సి ఉంటుంది. అయితే.. సాధారణంగా ఇలాంటి పోస్టులకు నిర్లక్ష రాస్యులో.. లేదంటే పదిలోపు చదివిన వారు దరఖాస్తులు చేసుకుంటారని అనుకుంటాం. విద్యార్హత కూడా అక్కర్లేని ఈ ఉద్యోగాలకు ఈ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని ఎవరూ అనుకోరు.

కానీ.. ఆశ్చర్యకరంగా ఈ పోస్టుల కోసం 46వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 6వేల మంది గ్రాడ్యుయేట్లు, 12వ తరగతి వరకు చదివిన 1.2లక్షల మంది వీరితోపాటు ఇతరులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా స్వీపర్ ఉద్యోగం చేయడానికి ఈ దరఖాస్తులు చేసుకోవడం చూస్తుంటే దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిజినెస్ స్టడీస్‌లో డిప్లొమాతో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన మనీష్ కుమార్, క్వాలిఫైడ్ టీచర్ అయిన అతని భార్య రూప కూడా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

హెచ్‌కేఎన్ఆర్ఎన్ పూల్ ద్వారా జరిగే ఈ రిక్రూట్మెంట్‌లో ఎంపికైతే నియమించుకున్న కాంట్రాక్టర్ నెలకు రూ.15వేల వేతనం ఇస్తారు. హెచ్‌కేఎన్ఆర్ఎన్ అనేది హర్యానా రాష్ట్ర ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ. ఇందులో ఎంపికైన వారికి సొంత జిల్లాల్లోనే ఈ పోస్టింగ్ ఇవ్వనున్నారు. అయితే.. ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడడంతో పోస్టుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉందని హెచ్‌కేఎన్ఆర్ అధికారులు చెబుతున్నారు.

అయితే.. ఈ ఉద్యోగాలకు ఇంత డిమాండ్ ఎందుకా అని ఆరా తీస్తే.. ఇప్పుడు స్వీపర్‌గా చేరినా భవిష్యత్తులో ఆ ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని నిరుద్యోగులు ఆశతో ఉన్నారట. మరికొందరైతే ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం నుంచి బయటపడుతామని భావిస్తున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టే ఘటన ఇదని అభిప్రాయపడుతున్నారు.