Begin typing your search above and press return to search.

వర్రా వాంగ్మూలం మరో ముగ్గురి అరెస్టు మొత్తం 70 మందిపై కేసు

ఈ కేసులో కీలక నిందితుడైన కడప జిల్లా పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంతో 70 మందిపై కేసులు నమోయ్యాయి.

By:  Tupaki Desk   |   31 Dec 2024 9:42 AM GMT
వర్రా వాంగ్మూలం మరో ముగ్గురి అరెస్టు మొత్తం 70 మందిపై కేసు
X

ఏపీలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగులకు సంబంధించి అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడైన కడప జిల్లా పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంతో 70 మందిపై కేసులు నమోయ్యాయి. ఇందులో పలువురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు తాజాగా గుంటూరుకు చెందిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

వైసీపీ సోషల్ మీడియా ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నిందితులను పోలీసులు వరుసగా అరెస్టు చేస్తున్నారు. ప్రధాన నిందితుడైన పులివెందుల వాసి వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాలకు చెందిన సుమారు 70 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా, తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన హరిక్రిష్ణా రెడ్డి, ప్రేమ్ సాగర్, వెంకట్రామిరెడ్డిలను అదుపులోకి తీసుకుని పులివెందుల తరలించారు. ఇదే కేసులో ఇప్పటివరకు 55 మందిని పులివెందుల పోలీసులు విచారించారు. చాలా మందికి 41ఏ నోటీసులిచ్చారు. మరోవైపు సోషల్ మీడియా కేసుల్లోఅరెస్టుల నేపథ్యంలో ప్రొద్దుటూరులో రూరల్ ఎస్ఐ మహమ్మద్ రఫీపై కొందరు దుండగులు దాడి చేశారు. నిందితులను రాజుపాలెం గ్రామస్థులుగా గుర్తించిన పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియా కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతుండటంతో నిందితులు బయటకు రాడానికే భయపడుతున్నారు. వీరిని అరెస్టు చేసేందుకు కడప జిల్లా నుంచి స్పెషల్ పోలీసు టీం ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతోంది. మరోవైపు కేసులో మరో కీలక నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. తనకు రాఘవరెడ్డి నుంచి కంటెంట్ వస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడినని ప్రధాన నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి విచారణలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే వర్రా రవీందర్ రెడ్డి ఎవరో తనకు తెలియదని రాఘవరెడ్డి చెబుతుండటంతో పోలీసులు తగిన సాక్ష్యాధారాలను సేకరిస్తూ ఇద్దరి మధ్య లింకును కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ కేసులో మరిన్ని అరెస్టులకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాఘవరెడ్డి స్టేట్ మెంట్ ప్రకారం కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఉచ్చు బిగించేలా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు.