Begin typing your search above and press return to search.

ఇదొక చక్కని మేలు కొలుపు.... అందరూ భాగస్వాములు కావాలి!

సోషల్ మీడియా విషయమే తీసుకుంటే బలమైన ఆయుధాన్ని మంచి కోసం వాడుకోవచ్చు.

By:  Tupaki Desk   |   28 Dec 2024 5:06 PM GMT
ఇదొక చక్కని మేలు కొలుపు.... అందరూ భాగస్వాములు కావాలి!
X

సోషల్ మీడియా అన్నది ఈ రోజున సాంకేతిక విజ్ఞానం అందించిన పదునైన అస్త్రం. దానిని సవ్యంగా వాడుకోవాలి. కత్తిని కూరగాయలు తరగడానికి ఉపయోగించుకోవచ్చు, అదే విధంగా పీకలు కోసేందుకు కూడా వినియోగించవచ్చు. అది కత్తి పట్టుకునే వాడి వివేచన బట్టి ఆధారపడి ఉంటుంది.


సోషల్ మీడియా విషయమే తీసుకుంటే బలమైన ఆయుధాన్ని మంచి కోసం వాడుకోవచ్చు. మంచి విషయాలను నలుగురికీ పంచవచ్చు. అలా చేసే పోస్టుల ప్రభావం అధికంగా ఉండి మంచి సమాజానికి అవి కారణం అవుతాయి. నలుగురికీ ఉపయోగపడుతూ మేలు చేసే వాటిని పంచుకోవడం ద్వారా సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించాలి.


సోషల్ మీడియా ద్వారా సామాజిక చైతన్యం తేవచ్చు. ఎంతో విజ్ఞానం అందించవచ్చు. ఎక్కడెక్కడో ఉన్న వారు తాము చూడని వింతలూ విశేషాలు తెలుసుకోవచ్చు. అయితే జరుగుతున్నది ఏమిటి అంటే సోషల్ మీడియాలో అంతా ఒక ఆకర్షణగా చూడడం. దాని కోసమే ఉందని తప్పుడు అభిప్రాయానికి రావడం.


ఎక్కువగా జనాలకు రీచ్ కావాలని చేస్తున్న విన్యాసాలు చివరికి సోషల్ మీడియా అనే ఆయుధాన్ని తుప్పు పట్టిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీలు కూడా చక్కగా సోషల్ మీడియాను వాడుకోవచ్చు. తమ పార్టీ తరఫున ప్రచారానికి రియల్ టైం లో జనాలకు చేరవేయవచ్చు. అయితే ఇపుడు అంతా దానిని ప్రత్యర్ధుల మీద విమర్శలకు వాడుకుంటున్నారు.


సోషల్ మీడియా ఉన్నదే బురద జల్లడానికి అన్నట్లుగా తయారు చేశారు. ఎటువంటి ఆధారాలూ లేకుండా అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఇంట్లో ఆడవారిని సైతం ఇందులోకి తెస్తున్నారు. ఆ విధంగా నైతిక పతనానికి అంతా చేరుకుంటున్నారు. సోషల్ మీడియా విషయంలో ఈ తీరున సాగుతున్న దుర్నీతి పీక్స్ కి వెళ్ళిపోతోంది.

సోషల్ మీడియా బాధితులు ఒక వైపు పెరిగిపోతూంటే తప్పుడు పోస్టులు పెట్టిన వారు చాలా మంది కేసులను ఎదుర్కొంటున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది. అంతా విద్యావంతులే కదా. సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలో తెలిసిన వారే కదా అని ఇపుడు కొత్తగా చర్చ వస్తోంది.

ఈ నేపధ్యంలో ఒక అద్భుతమైన కాంపెయిన్ అయితే సోషల్ మీడియా విషయంలో మొదలైంది. సోషల్ మీడియాలో చెడు ప్రచారం వద్దు అంటూ మొదలైన ఈ ప్రచారానికి అపూర్వమైన స్పందన లభిస్తోంది. మూడు కోతుల బొమ్మలను సింబాలిక్ గా ఉంచుతూ భారీ ఫ్లెక్సీలతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వద్దు అంటూ ఇస్తున్న నినాదాలు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయని చెప్పాలి.

అమరావతితో పాటు,విజయవాడ, విశాఖపట్నం వంటి చోట ముఖ్య కూడళ్ళలో ఏర్పాటు చేసిల ఫ్లెక్స్లీలు అందరికీ ఇపుడు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఉంచిన మెసేజ్ అయితే అందరిలోనూ ఆలోచనలను తట్టి లేపుతోంది అని చెప్పాల్సి ఉంది.

సోషల్ మీడియాలో అసంబద్ధమైన సమాచారం వద్దని, అలాగే అసత్య ప్రచారాలకు, దూషణలకు చెక్ పెడదామని నినాదాలను ఈ ఫ్లెక్సీల ఏర్పాటు ద్వారా జనంలోకి ఉంచుతూ సరికొత్త ప్రచారంలోకి తెస్తున్నారు. చెడు విషయాలు పోస్ట్ చేయవద్దు అలాగే, నైతికంగా పతనం కావొద్దు అని ప్రతిజ్ఞ చేద్దామని సైతం పిలుపునిస్తున్నారు.

ఈ స్లోగన్స్ అన్నీ అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లీష్ తో పాటు తెలుగు భాషలలోనూ ఏర్చి కూర్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనక గట్టి నిబద్ధత అయితే ఉంది. సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం అంటూ ఫ్లెక్సీలు హోర్డింగ్స్ ద్వారా చైతన్యం తెచ్చేందుకు ఈ రకమైన చర్యలు చేపట్టారని అంటున్నారు.

ఇది చాలా మంచి ప్రచారంగానే అంతా చూస్తున్నారు. మద్దతు కూడా ఇస్తున్నారు. అయితే వీటిని ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. కానీ ఇదొక యజ్ఞం. ఇదొక చక్కని మేలు కొలుపు. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. ముఖ్యంగ్నా సోషల్ మీడియాలో నిత్యం తరించే యువత వీటిని ఆకళింపు చేసుకుని దానికి అనుగుణంగా తాము పెట్టే పోస్టింగులలో మార్పు తీసుకుని వస్తే కనుక సమాజంలో మార్పు కచ్చితంగా వస్తుంది అని అంటున్నారు.

గతంలో అయితే సోషల్ మీడియా అలా లేదు. కొద్ది సంవత్సరాలలోనే ఇలా తయారైంది. నైతికంగా పాతాళం అంచులను చూస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది అయితే ఏమీ లేదు. తప్పు జరిగినది చక్క దిద్దుకునే విధంగా కార్యక్రమం చేపట్టాలి. సోషల్ మీడియాలో అందరూ మంచి పోస్టులు పెడితే ఉత్తమమైన సమాజానికి ఆవిర్భావం జరుగుతుంది. ఆ విధంగా ఏపీ దేశానికే ఆదర్శంగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.