గోవా పర్యాటకాన్ని చెడగొట్టే ప్రయత్నం.. చైనా విడుదల చేసిన సర్వేపై అనుమానాలు.!
దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గోవా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడికి దేశవిదేశాల నుంచి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.
By: Tupaki Desk | 4 Jan 2025 5:30 PM GMTదేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గోవా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడికి దేశవిదేశాల నుంచి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి సముద్ర అందాలు, వాతావరణం పర్యాటకులను ఎంతో ఆనందానికి గురిచేస్తాయి. వీకెండ్, ఇయర్ ఎండ్ సెలబ్రేషన్‌కు, స్నేహితులు, బ్యాచిలర్ పార్టీలకు గోవా పెట్టింది పేరు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు దీనిని ఒక విడిది కేంద్రంగా భావిస్తుంటారు. గ్రూపులుగా వచ్చి ఇక్కడ రోజులు తరబడి ఉండి ఎంజాయ్ చేసి వెళుతుంటారు. అటువంటి గోవాపై పనిగట్టుకుని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాలు వేదికగా ఈ ప్రచారం సాగుతుండడం గమనార్హం.
ఈ మధ్య కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గోవా పర్యాటకం పట్ల వ్యతిరేక కథనాలు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా సోషల్ మీడియా ఆధారంగా ఈ ప్రచారం సాగుతోంది. పండగ సీజన్‌లో గోవా వెళ్లే వారి సంఖ్య తగ్గిందని, దీనికి అనేక కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాస్తవంగా చూస్తే గతంతో పోలిస్తే గోవా పర్యాటకం మరింత ఎక్కువగా పెరిగింది. గడిచిన కొన్నాళ్లుగా ఇక్కడకు వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హోటల్స్ పర్యాటకులతో పూర్తిగా నిండిపోతున్నాయి. బీచులు కూడా సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. నైట్ లైఫ్ కూడా కలర్ ఫుల్‌గా సాగుతోంది.
ఒకవైపు గతంతో పోలిస్తే గోవా పర్యాటకం జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతుంటే.. మరోవైపు మాత్రం గోవాకు పర్యాటకుల తాకిడి తగ్గిందంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా ప్రచారాలను కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు చెబుతున్న విషయాన్ని చైనా ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సర్వే పేరుతో విడుదల చేసింది. దీనిపై ప్రస్తుతం అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ సోషల్ ఇన్‌ప్లూయెన్సర్లు ఇష్టానుసారంగా వీక్షకుల కోసం పరస్పర విరుద్ధమైన వార్తా కథనాలను ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఒకవైపు విమాన చార్జీలు, హోటల్ ఖర్చులు భారీగా పెరిగాయని చెబుతుండగా.. మరోవైపు బీచ్లు, వీధులు ఖాళీగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కథనాలను వండి వారుస్తున్నారు. గోవాలో సందర్శకులు లేనప్పుడు ఖర్చులు ఎందుకు పెరుగుతాయన్న కనీస జ్ఞానం లేకుండా కొందరు తప్పుడు ప్రచారం చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గణాంకాలతో సంబంధం లేకుండా నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు ఇలాంటి తప్పుడు కథనాలను వండి వారుస్తున్నారు.
2024 డిసెంబర్‌లో గోవాకు అదనంగా రూ.75.51 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో ముగిసిన మూడు త్రైమాసికాల్లో మొత్తం ఆదాయం రూ.4,614.77 కోట్ల రూపాయల ఆదాయం పర్యాటక రంగం ద్వారానే గోవా సాధించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.365.43 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభించింది. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న తప్పుడు కథనాలు వల్ల గోవా పర్యాటక రంగాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. గోవాలో పర్యాటక రంగం క్షీణిస్తోందన్నది అపోహ మాత్రమేనని, వాస్తవ పరిస్థితులను చూస్తే మరింత రెట్టింపుతో పర్యాటక రంగం ముందుకు సాగుతోందని గణాంకాలు చూస్తే వెల్లడవుతోంది.
సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు ద్వారా చైనా ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ విడుదల చేసిన ఈ సర్వే వెనుక ఎవరున్నారన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి వక్కానిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో పర్యాటక రంగాన్ని ఇబ్బందులకు గురిచేసేలా మరింత దుష్ప్రచారం చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై గోవా ప్రభుత్వంతోపాటు కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.