చంద్రబాబు ఇంటికి బుడమేరుకు లింకు లాజిక్ జగనే చెప్పాలట
జగన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది. బాబు ఇంటికి.. బుడమేరుకు లింకు పెట్టిన జగన్.. దాని లాజిక్ ఏమిటో చెబుతారా? అని ప్రశ్నిస్తున్నారు.
By: Tupaki Desk | 3 Sep 2024 4:32 AM GMTవరదల్లో చిక్కుకుపోయిన విజయవాడలో బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇంటి కరకట్టను కాపాడుకోవటానికే బుడమేరుకు నీటిని విడుదల చేశారంటూ చేస్తున్న వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. జగన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది. బాబు ఇంటికి.. బుడమేరుకు లింకు పెట్టిన జగన్.. దాని లాజిక్ ఏమిటో చెబుతారా? అని ప్రశ్నిస్తున్నారు.
దీనికి కారణం విజయవాడ నగరానికి ఒకవైపు బుడమేరు ఉంటే.. ఇంకోవైపు క్రిష్ణా నది ప్రవహిస్తోందని.. వాటి ప్రవాహ మార్గాలు వేర్వేరు అన్న విషయాన్ని జగన్ ఎందుకు మిస్ అయ్యారు?అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ రెండు కలిసే అవకాశం లేనప్పటికీ.. కరకట్టపై ఉన్న తన ఇంటిని కాపాడుకోవటానికి బుడమేరుకు నీటిని విడుదల చేశారంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటున్నారు.
కరకట్టపై చంద్రబాబు ఇంటిని రక్షించేందుకు విజయవాడలోని ఈ ప్రాంతాన్ని నీటిమయం చేశారు. నేనను ప్రతి ప్రశ్న లాజికల్ గా అడుతున్నా అంటూ వ్యాఖ్యానించిన జగన్ కు పలువురు పలు ప్రశ్నల్ని సంధిస్తున్నారు. వాటికి సమాధానాలు చెప్పగలరా? అని సవాలు విసరుతున్న వైనం ఆసక్తికరంగా మారింది.
అందులో కీలకమైనది క్రిష్ణా నదికి గరిష్ఠంగా 11.43 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని.. బుడమేరుకు వచ్చిన వరద కేవలం 35 వేల క్యూసెక్కులేనని చెబుతున్నారు. అంటే.. బుడమేరకు వచ్చిన 35 వేల క్యూసెక్కులను ఆపితే క్రిష్ణా నదికి వచ్చే వరద ఆగుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. అయినా.. ఒకవైపు క్రిష్ణా నది ఉంటే.. మరోవైపు బుడమేరు ఉంటుంది కదా? ఈ రెండు కలిసే ఛాన్సులు లేవు కదా? చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీగా వరద వచ్చిన వేళలో.. ఆ విషయాన్నిపక్కన పెట్టేసి.. మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టటం ఏమిటి? అంటూ నిలదీస్తున్నారు.