'సామాజిక ఇంజనీరింగ్' ఏమైపోయిందబ్బా..!
ఇక, ఈ సామాజిక ఇంజనీరింగ్ విషయాన్ని సీఎం జగన్ ఇక్కడితో కూడా వదిలేయలేదు. స్థానిక సంస్థలు.. కార్పొరేషన్లు.. వంటి వాటికి కూడా విస్తరించారు.
By: Tupaki Desk | 5 Aug 2023 7:55 AM GMTసామాజిక ఇంజనీరింగ్ విషయంలో వైసీపీకి ఉన్న ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందే. 2019లో అధికారంలో కి వచ్చిన వెంటనే సామాజిక ఇంజనీరింగ్‌కు పెద్దపీట వేస్తూ.. వైసీపీ అధినేత, సీఎం జగన్.. తన మంత్రి వర్గం లో అన్ని కులాల నాయకుల కు ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా అగ్రవర్ణాలకు కూడా.. జగన్ ప్రాధాన్యతను కల్పించారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పోస్టులు.. సహా అనేక మందికి పదవు లు ఇచ్చారు.
ఇవన్నీ ఎందుకు చేశారంటే.. ఎన్నికల్లో మరోసారి తనకు అనుకూలంగా ఆయా సామాజిక వర్గాలను మలు చుకునేందుకే. ఇక, ఈ సామాజిక ఇంజనీరింగ్ విషయాన్ని సీఎం జగన్ ఇక్కడితో కూడా వదిలేయలేదు. స్థానిక సంస్థలు.. కార్పొరేషన్లు.. వంటి వాటికి కూడా విస్తరించారు. జనరల్ మేయర్ సీటు ను కూడా బీసీల కు ఇచ్చేసి.. వారికి ఒక రకంగా మేలు చేశామని వైసీపీ నాయకులు చెప్పుకొన్నారు. ఇక, రాష్ట్రం లోని 68 కులాల వారికి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.
మొత్తంగా చూస్తే.. ఏపీ లో గతానికి భిన్నమైన వ్యవహారంతోపాటు.. ఆయా సామాజిక వర్గాల కు మేలు చేసే వ్యవహారమే తెరమీదికి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కట్ చేస్తే.. మరో 8-9 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ చేసిన ఈ సామాజిక ఇంజనీరింగ్ ప్రక్రియ పార్టీకి, ఆయనకు ఏమేరకు ఫలితాన్ని ఇస్తోందనే వ్యవహారం ఆసక్తిగా మారింది. ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు వైసీపీ నాయకులు అందరూ కూడా ఈ విషయాన్ని మరిచిపోయారనే చెప్పాలని అంటున్నారు.
ఎవరికి వారు.. తమకు నిధులు ఇవ్వడం లేదు.. తమ కార్పొరేషన్ ద్వారా ఏమీ చేయలేకపోతున్నాం.. అనే వాదననే వినిపిస్తున్నారు తప్ప.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఆయా కార్పొరేషన్ల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే వ్యూహాన్ని మరిచిపోయినట్టుగా ఉన్నాయనేది వైసీపీ అంతర్గత విశ్లేషణల్లో స్పష్టంగా తెలుస్తోంది.
పైగా ఇప్పుడు ఎక్కడా కూడా.. సోషల్ ఇంజనీరింగ్ గురించిన చర్చే లేకపోవడం గమనార్హం. ఇదంగా సర్కారు చేసుకున్న స్వయం కృతమేనని పరిశీలకులు చెబుతున్నారు. నిధులు ఇవ్వకుండా.. నియామకాలు చేపట్టడం.. అధికారాలు లేని పదవులు అప్పగించడం ద్వారా.. స్వయం నిర్దేశిత లక్ష్యాన్ని సర్కారు అందిపుచ్చుకోలేక పోయిందని అంటున్నారు.