Begin typing your search above and press return to search.

కీలక నిర్ణయం.. సోషల్ మీడియా ప్రచారం సైతం ఎన్నికల ఖర్చు ఖాతాలోకే!

గత ఎన్నికల్లోనే మొదలైన సోషల్ మీడియా ప్రచారానికి అయ్యే ఖర్చును కూడా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో భాగం అవుతుందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 4:39 AM GMT
కీలక నిర్ణయం.. సోషల్ మీడియా ప్రచారం సైతం ఎన్నికల ఖర్చు ఖాతాలోకే!
X

ఎన్నికలు అన్నంతనే మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. అభ్యర్థులు ఒక విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అంశం ఎన్నికల సందర్భంగా పెట్టే ‘ఖర్చు’ మీదే. ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. అందుకే.. మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నా.. రోజువారీ ఖర్చుకు సంబంధించిన వివరాల్ని లెక్కేసేందుకు వీలుగా ఎవరికి వారు ఒక టీంను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవటం కనిపిస్తోంది.

మారిన కాలానికి తగ్గట్లు.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఇట్టే వినియోగించే అభ్యర్థులకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం చేసిన మార్పుల గురించి అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గత ఎన్నికల్లోనే మొదలైన సోషల్ మీడియా ప్రచారానికి అయ్యే ఖర్చును కూడా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో భాగం అవుతుందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఎన్నికల వ్యయ పరిశీలకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు.. మద్యం.. ఇతర వస్తువులు పంపిణీ చేయటాన్ని లంచంగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ప్రకటనలు (యాడ్స్).. పెయిడ్ న్యూస్ తో పాటు సోషల్ మీడియా ప్రచారానికి అయ్యే ఖర్చును కూడా ఎన్నికల ఖర్చు కింద లెక్క తీసుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని స్పస్టం చేశారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడించిన 30 రోజుల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఖర్చు వివరాల్ని జిల్లా ఎన్నికల అధికారికి కచ్ఛితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన ఖర్చులపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన ఉంటుంది.

ఇటీవల కాలంలో పెరిగిన సోషల్ మీడియాకు పెట్టే ఖర్చు కూడా ఖర్చు ఖాతాలోకి వస్తుందన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించాల్సి ఉంటుంది. లేదంటే.. మొదటికే మోసం వస్తుందన్నవిషయాన్ని గమనించాల్సి ఉంటుంది. సో.. అభ్యర్థులు పారాహుషార్.