Begin typing your search above and press return to search.

ఎన్నికల సీజన్‌.. వీరి పంట పండుతోందిగా!

ఒకప్పుడు ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి, వాస్తవాలను నిర్ధారించుకోవడానికి టీవీలు, పత్రికలపైనే అంతా ఆధారపడేవారు.

By:  Tupaki Desk   |   10 April 2024 4:55 AM GMT
ఎన్నికల సీజన్‌.. వీరి పంట పండుతోందిగా!
X

ఒకప్పుడు ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి, వాస్తవాలను నిర్ధారించుకోవడానికి టీవీలు, పత్రికలపైనే అంతా ఆధారపడేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. టెక్నాలజీ పుణ్యమాని స్మార్ట్‌ ఫోన్లు, 5జీ వేగంతో ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చేశాయి. క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా సమాచారం అందరికీ తెలుస్తోంది.

ముఖ్యంగా సోషల్‌ మీడియా ప్రజల జీవితాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా అయిన పత్రికలు, టీవీలకంటే సోషల్‌ మీడియాపైనే అంతా ఆధారపడుతున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చినదాన్నే నిజంగా నిర్ధారించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్లకు పంట పండుతోంది.

ప్రస్తుతం మనదేశంలో పార్లమెంటుకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. దీంతో అన్ని పార్టీలు ఇప్పుడు సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్లపైనే ఆధారపడుతున్నాయి. ఏ పార్టీ సోషల్‌ మీడియా విభాగం బలంగా ఉంటే ఆ పార్టీకి అంతగా విజయావకాశాలు ఉంటాయనే భావన వ్యక్తమవుతోంది.

అలాగే తటస్థులుగా ఉండే సోషల్‌ మీడియా ఇన్‌ ప్లుయెన్సర్లు భారత రాజకీయాలను, ప్రజలను బలంగా ప్రభావితం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని ఒక పార్టీకి అనుకూలంగా తిప్పడంలోనూ, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడంలోనూ సోషల్‌ మీడియా ఇన్‌ ప్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

దీంతో రాజకీయ పార్టీలు సైతం సోషల్‌ మీడియా ఇన్‌ ప్లుయెన్సర్లపై కన్నేశాయి. ఫేస్‌ బుక్, ట్విట్టర్‌ (ప్రస్తుతం ఎక్స్‌), ఇనస్టాగ్రామ్, షేర్‌ చాట్‌ , యూట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఖాతాలు కలిగి ఉండి, పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్న సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్లపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓటర్లను ప్రభావితం చేయడంతోపాటు రాజకీయ పరమైన చర్చలను సోషల్‌ మీడియాలో రేకెత్తించేలా చేస్తున్న వీరిపై కన్నేశాయి.

ఎవరైనా ఏదొక సోషల్‌ మీడియా ఖాతాను కలిగి ఉండి.. చెప్పుకోదగిన సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉంటే వారిపై ఆయా రాజకీయ పార్టీలు వల వేస్తున్నాయి. వారికి ప్రతి నెలా జీతంలాగా లేదా ఒకే భారీ మొత్తాన్ని చెల్లించి తమ వైపుకు తిప్పుకుంటున్నాయి. తమ పార్టీలకు లబ్ధి చేకూరేలా వారితో పోస్టులు పెట్టిస్తున్నాయి. దీంతో ఎంతో కాలం నుంచి ఆయా సోషల్‌ మీడియా ఖాతాలను ఫాలో అవుతున్నవారు ఇన్‌ ఫ్లుయెన్సర్ల ప్రభావానికి లోనవుతున్నారు.

ఎన్నికల్లో గెలుపొందడంలో ఒక్క ఓటు కూడా కీలకమే. 5, 10 ఓట్ల తేడాతోనూ ఓడిపోయినవాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏ రిస్కూ తీసుకోదలుచుకోలేదు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ఇన్‌ ప్లుయెన్సర్ల ప్రాధాన్యతను రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సుర్లు తాము పెట్టే ఒక్క వీడియో లేదా పోస్టుకే 50 వేల వరకు సంపాదిస్తున్నారని చెబుతున్నారు.

ఎన్నికల సీజన్‌ రెండు మూడు నెలల్లోనే సోషల్‌ మీడియా ఇన్‌ ప్లుయెన్సర్లు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. తక్కువ ఫాలోవర్లు ఉన్నవారు 50 వేల రూపాయల నుంచి లక్ష వరకు పొందుతున్నారు.

పార్టీలు తమ సందేశాలను పంపడానికి ఒకప్పుడు సంపద్రాయ మీడియా అయిన పత్రికలు, టీవీపైనే ఆధారపడేవారు. ఇప్పుడు వారు సోషల్‌ మీడియాపైన ఆధారపడుతున్నారు.

ఇటీవల బీజేపీ 500 మంది సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలాగే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేసిన మంచి పనులను చెప్పుకోవడానికి సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్లపైనే ఆధారపడుతున్నాయి.

అయితే ఈ సోషల్‌ మీడియా ఇన్‌ ప్లుయెన్సర్లు కూడా పెయిడ్‌ ప్రమోటర్లే. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు వీరి ప్రభావానికి లోనై తప్పుడు నిర్ణయం తీసుకుంటే అంతిమంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.