సోషల్ మీడియాపై ప్రత్యేక ఫోకస్!
ఇకనుండి నెటిజన్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే కేసులు మెడకు చుట్టుకోవటం ఖాయం
By: Tupaki Desk | 14 Aug 2023 6:53 AM GMTఇకనుండి నెటిజన్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే కేసులు మెడకు చుట్టుకోవటం ఖాయం. ఎందుకంటే సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ప్రత్యేకమైన నిఘా మొదలుపెట్టారు. ఇందుకోసం ఏపీ పోలీసు శాఖ ప్రత్యేకంగా 130 మంది నిపుణులతో ప్రత్యేకమైన బృందాన్నే ఏర్పాటు చేసింది. ఈ బృందం అత్యంత ఆధునికమైన టెక్నాలజీ సాయంతో నిరంతరం సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తుంటుంది. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని వాళ్ళు చాలా అరుదనే చెప్పాలి.
సోషల్ మీడియాను వ్యక్తులు వాడడం కన్నా రాజకీయ పార్టీల వాడకమే చాలా ఎక్కువ. ఎన్నికలకు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రతి పార్టీ కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నది. అందులో వందలాది మందిని రిక్రూట్ చేసుకుని తమ పార్టీ ప్రచారాన్ని చేయించుకుంటున్నది. తమ పార్టీకి అనుకూలంగా ప్రచారాలు చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ తమను పాజిటివ్ గా హైలైట్ చేయించుకుంటునే మరోవైపు ప్రత్యర్ధిపార్టీలపై బాగా నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నాయి.
సమస్యంతా ఇక్కడే వస్తున్నది. ఈ సమస్య కూడా రెండురకాలుగా ఉంటోంది. మొదటిదేమో పార్టీలే ప్రత్యర్ధిపార్టీలపై నెగిటివ్ ప్రచారం చేయించటం. రెండో సమస్య ఏమిటంటే పార్టీల అభిమానులు, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు తమంతట తాముగానే ప్రత్యర్ధిపార్టీలను గబ్బుపట్టించటం. రెండు పద్దతులు ఇపుడు ఎక్కువపోవటంతోనే గొడవలు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు సోషల్ మీడియాలో కనిపించే పోస్టుల వల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి.
అందుకనే ఏపీ పోలీసులు ప్రత్యేకంగా సోషల్ మీడియా ను మానిటర్ చేయటం కోసమే 130 మంది నిపుణులతో ప్రత్యేక టీమును ఏర్పాటుచేసింది. ఈ టీము ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలపై నిరంతర నిఘా పెడుతుందని డీజీపీ రాజేంద్రనాధరెడ్డి చెప్పారు. సమాజంలో అశాంతిని రేకెత్తించటమే టార్గెట్ గా పనిచేసే వాళ్ళపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించటానికే ప్రత్యేక నిపుణులతో పోలీసు శాఖ బృందాన్ని ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు అవసరమైతే నిపుణులను పిలిపించే వాళ్ళు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా టీమునే ఏర్పాటు చేసేశారు.