Begin typing your search above and press return to search.

ట్రోలింగ్ రాబందులే ఆమె ప్రాణాలు తీశాయా?

చివరకు ఓ వ్యక్తి అతడిని పట్టుకుని కిందకి దించాడు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

By:  Tupaki Desk   |   20 May 2024 10:47 AM GMT
ట్రోలింగ్ రాబందులే ఆమె ప్రాణాలు తీశాయా?
X

తల్లి ఒడిలో వెచ్చగా ఆడుకుంటున్న ఓ చిన్నారి బాలుడు అనుకోకుండా జారిపోయి నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని రేకులపై పడ్డాడు. కానీ ఏం కాలేదు. సురక్షితంగా ఉండటంతో అందరు కలిసి అతడిని సురక్షితంగా కాపాడారు. అపార్ట్ మెంట్ లోని ప్రతి ఒక్కరూ అతడి కోసం తపించారు. చివరకు ఓ వ్యక్తి అతడిని పట్టుకుని కిందకి దించాడు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఇంతటితో ఈ ఘటనకు శుభం కార్డు పడాలి. కానీ అప్పుడే మొదలైంది. సోషల్ మీడియాలో బాలుడి తల్లిపై నిందలు. క్రూరత్వంగా సూటిపోటి మాటలతో ఆమె మనసును కకావికలం చేశారు. చేతిలో ఫోన్ ఉంది కదాని ప్రతి ఒక్కడు రెచ్చిపోయి పోస్టులు పెట్టడంతో ఆమె మనసు చివుక్కుమంది. ఛీ ఇక బతుకు ఎందుకు అనే నైరాశ్యంలోకి వెళ్లిపోయింది.

ఫలితంగా ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆ బాలుడు ఒంటరివాడయ్యాడు. ప్రస్తుతం అతి బాగోగులు చూసేది ఎవరు? అతడిని ఆడించేది ఎవరు? ఎవరైనా కన్న తల్లి బిడ్డను చంపాలని చూస్తుందా? ఏదో పొరపాటుగా పడితే దానికి నెట్టింట్లో పోస్టులతో వెర్రెత్తించారు. అమ్మ కాదు బొమ్మ అంటూ అడ్డగోలుగా రాశారు. దీంతో ఆమె మనసు పాడైపోయి చివరకు ప్రాణాలు తీసుకుంది.

ఇంతవరకు ఆమెను వేధించిన వారు ఇప్పుడు ఏం చెబుతారు? ఆ బాబుకు అండగా ఎవరు నిలుస్తారు? పిచ్చి పిచ్చి రాతలతో రాబందుల్లా ఆమెను సూటిపోటి మాటలతో పొడిచి చంపారు. ఆ బాలుడిని అనాథను చేశారు. ఎవరి పిల్లలనైనా తల్లి కాపాడుతుంది కానీ చంపదు. అలాంటి తల్లి మనసును అర్థం చేసుకోని వీరు మనుషులేనా? వీరికి మానవత్వం ఉందా?

బాలుడి తల్లి రమ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. ట్రోలింగ్ ురుగులు కిల్లింగ్ రూపంలో ఆమె కుటుంబాన్ని ఆగం చేశారు. ఓ బిడ్డకు తల్లిని లేకుండా చేశాయి. ఈ ఘటన అందరిని కలచివేసింది. ఇంతటి దుర్మార్గమైన చర్యను ఖండిస్తున్నారు. వారి మానసిక దౌర్బల్యాన్నితప్పుబడుతున్నారు.