Begin typing your search above and press return to search.

26 ఏళ్ల నహిద్ కా నసీబ్.. బంగ్లాలో అంతా అతడే చేశాడు.. సర్కార్ ను కూల్చాడు

వరుసగా నాలుగోసారి.. అందులోనూ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు.. ప్రతిపక్షం అసలు లేనే లేదు

By:  Tupaki Desk   |   6 Aug 2024 10:08 AM GMT
26 ఏళ్ల నహిద్ కా నసీబ్.. బంగ్లాలో అంతా అతడే చేశాడు.. సర్కార్ ను కూల్చాడు
X

వరుసగా నాలుగోసారి.. అందులోనూ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు.. ప్రతిపక్షం అసలు లేనే లేదు.. మిలటరీ కూడా తోక జాడించడం లేదు.. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలున్నాయి.. అయినా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం ఎందుకు కుప్పకూలింది..? యువత, విద్యార్థుల ఆందోళనలను అణచివేయలేక ప్రధానమంత్రి పదవి పోయిందా..? అలాగైతే.. దీని వెనుక ఉన్నది ఎందరు? ఎవరు సారథ్యం వహించారు..? వయసు మీరి తలపండిన రాజకీయ నాయకులా? వారికైతేనే ఇంత శక్తి ఉంటుంది కదా అంటారా? కానీ కానే కాదు.

చిన్న ఆందోళనను ఉద్యమంగా మార్చి

తలకు బంగ్లా జాతీయ పతాకాన్ని చుట్టుకుని బంగ్లాదేశ్ ఆందోళనల సందర్భంగా ఇటీవల ఫొటోల్లో బాగా కనిపించిన వ్యక్తి 26 ఏళ్ల నహిద్ ఇస్లామ్. ఢాకా యూనివర్సిటీ సోషియాలజీ స్టూడెంట్. ఇతడే అంతా చేశాడు..మూడు పదుల వయసు కూడా లేని నహిద్.. 15 ఏళ్ల హసీనా సర్కార్ ను కూల్చాడు. మొదట రిజర్వేషన్లపై చిన్న ఆందోళనగా మొదలు పెట్టి.. ఉద్యమం స్థాయికి తీసుకెళ్లాడు. దాన్ని దారితప్పకుండా సమన్వయం చేశాడు.

గత నెలలో రగిలిన అగ్గి..

మొదట కొందరు విద్యార్థులతో కలిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నహిద్‌ ఆందోళనలకు దిగాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఆందోళనే ఉద్యమంగా మారింది. దేశ ప్రజలకు నహిద్ ఎవరో తెలిసింది. జూలైలోనే జరిగిన ఘర్షణల్లో 300 మంది విద్యార్థులు చనిపోయాడు. వీరిలో చాలా మంది యూనివర్సిటీల్లో చదువుతున్నావారు. సుప్రీం కోర్టు తీర్పుతో కాస్త సద్దుమణిగినా.. రెండు రోజుల కిందట మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో హసీనా రాజీనామా చేసి వెళ్లిపోయారు.

ప్రజాస్వామ్యమే కావాలి..

నహిద్ అతడి సహచరుల్లో చెప్పుకోదగ్గ విషయం ఏమంటే.. వీరు సైనిక పాలనను వ్యతిరేకించడం మంగళవారం నహిద్‌ విద్యార్థి నాయకులతో కలిసి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌ ను కలవనున్నారు. అయితే, సైన్యం, ప్రత్యామ్నాయ ప్రభుత్వం కాకుండా.. ప్రసిద్ధ నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌ ప్రధాన సలహాదారుగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని కూడా తాము ఒప్పుకోమని చెబుతుండడం గమనార్హం.

విద్యావంతుల ఇంట్లో పుట్టి..

నహిద్ 1998లో బంగ్లా రాజధాని ఢాకాలో పుట్టాడు. ఇతడి తండ్రి ఉపాధ్యాయుడు. అన్న నఖిబ్‌ కూడా ఉద్యమకారుడే. మా తమ్ముడు దేశంలో మార్పు రావాలని ఆకాంక్షించేవాడని.. పోలీసులు స్పృహ తప్పేలా కొట్టి రోడ్డుపై పారేశారని.. అయినా అతడు భయపడకుండా పోరాడాడని.. ఇప్పుడు ప్రభుత్వాన్నే మార్చాడని నఖిబ్ గర్వంగా చెబుతున్నాడు.