Begin typing your search above and press return to search.

అన్నా సెబాస్టియన్ తర్వాత తాజాగా మరొకరు... ఏమి జరుగుతుంది?

పని ఒత్తిడి.. దాని ఫలితంగా డిప్రెషన్ లోకి వెళ్లడం.. ఆత్మహత్యకు పాల్పడటం వంటి వార్తలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   21 Sep 2024 11:30 PM GMT
అన్నా సెబాస్టియన్ తర్వాత తాజాగా మరొకరు... ఏమి జరుగుతుంది?
X

పని ఒత్తిడి.. దాని ఫలితంగా డిప్రెషన్ లోకి వెళ్లడం.. ఆత్మహత్యకు పాల్పడటం వంటి వార్తలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక పని గంటలే ఇందుకు కారణమనే వెర్షన్ బలంగా వినిపిస్తుంది. దీంతో వారానికి ఐదు రోజులు, రోజుకి 8 గంటలు మాత్రమే పని ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే చర్చ నెట్టింట బలంగా నడుస్తోంది.

ప్రధానంగా కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని.. తక్కువలో తక్కువ 12 నుంచి 14 గంటలు పనిచేసే పరిస్థితులు నెలకొంటున్నాయని.. దీంతో పర్సనల్ లైఫ్ పక్కకు పోవడమే కాకుండా.. విపరీతమైన ఒత్తిడి పెరిగి డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా ఓ టెకీ ఈ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు.

అవును... దేశవ్యాప్తంగా కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడిపై ఆందోళనలు కొనసాగుతోన్న వేళ తమిళనాడులోని థాజంబూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగానే తీవ్ర డిప్రెషన్ కి గురైన 38 ఏళ్ల కార్తికేయ.. తన ఇంట్లో ఆత్మహత్యకి పాల్పడ్డాడని చెబుతున్నారు. ఆ సమయంలో ఇంట్లో కార్తికేయ ఒక్కడే ఉన్నాడట.

అయితే.. అతడి భార్య బయటకు వెళ్లి వచ్చే సరికి కరెంటు వైర్లు శరీరానికి చుట్టుకుని అపస్మారకంగా పడి ఉన్నాడని చెబుతున్నారు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయసు వరుసగా 10 ఏళ్లు, 8 ఏళ్లు! బాధితుడు రెండు నెలల క్రితం డిప్రెషన్ తో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడు తీవ్రమైన పని ఒత్తిడికి గురైనట్లు చెప్పారు!

కాగా... ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి, 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పని ఒత్తిడి వల్లే ఆమె చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె తల్లి సంస్థ హెడ్ కు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడులోని ఓ టెకీ వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.