కాగ్నిజెంట్ వర్సెస్ ఇన్ఫోసిస్.. ముదిరిన రగడ!
ఏ వ్యాపారంలో అయినా.. పోటీ కామన్ అయిపోయింది. ఇది ఆరోగ్యకరమైన పోటీ అయితే ఫర్వాలేదు.
By: Tupaki Desk | 18 Feb 2025 8:31 AM GMTఏ వ్యాపారంలో అయినా.. పోటీ కామన్ అయిపోయింది. ఇది ఆరోగ్యకరమైన పోటీ అయితే ఫర్వాలేదు. కానీ .. ఒక్కొక్క సారి మాత్రం అది వివాదాలకు కూడా దారితీస్తోంది. తాజాగా రెండు ఐటీ దిగ్గజ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ.. తారస్థాయికి చేరుకుంది. వీటిలో ఒకటి ప్రముఖ దిగ్గజ వ్యాపారి నారాయణమూర్తికి చెంది న ఇన్ఫోసిస్ కాగా.. మరొకటి అమెరికాకు చెందిన కాగ్నిజెంట్. ఈ రెండు సంస్థల మధ్య వ్యాపారంలో పోటీ పెరుగుతోంది.
ఈ క్రమంలోనే కాగ్నిజెంట్-ఇన్ఫోసిస్ మధ్య పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇవి కోర్టుల వరకు కూడా వెళ్లాయి. తాజాగా.. అంతర్జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్.. ఇన్ఫోసిస్‌పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. తమ `ట్రైజెట్టో` నుంచి వాణిజ్య, వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్ చౌర్యం చేసినట్లు విమర్శలు చేసింది. అంతేకాదు.. `నాన్ డిస్‌క్లోజర్ అండ్ యాక్సిస్ అగ్రిమెంట్` ద్వారా ట్రైజెట్టో వాణిజ్య రహస్యాల్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపించింది.
ఈ క్రమంలో `ఇన్ఫోసిస్` రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు కాగ్నిజెంట్ ఆరోపించడం గమనార్హం. అయితే.. ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత.. ఆడిట్ చేసేందుకు ఇన్పోసిస్ నిరాకరించిందని కాగ్నిజెంట్ తెలిపింది. వాస్తవానికి ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ గత ఆగస్టులోనే అమెరికా కోర్టులో దావా వేసింది. కానీ.. ఈ ఆరోపణలను ఇన్ఫోసిస్.. తోసిపుచ్చింది.
అంతేకాదు.. కాగ్నిజెంట్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ బహిరంగంగానే ఉన్నాయని ఇన్పోసిస్ పేర్కొంది. అక్కడి తో కూడా ఆగకుండా.. కాగ్నిజెంట్ సీఈవోగా ఉన్న రవి కుమార్.. తమ దగ్గర పనిచేసిన సమయంలో హెల్త్ కేర్ సాఫ్ట్‌వేర్ విడుదలను ఆలస్యం చేశారని ఆరోపించింది. ఇన్ఫోసిస్‌లో ఈసీవోగా వ్యవహరించిన రవి కుమార్.. 2022 అక్టోబరులోనే తన పదవికి రాజీనామా చేశారు. 2023, జనవరిలో కాగ్నిజెంట్ సంస్థలో చేరారు.