ప్రేమకు అడ్డుపడతాడని తండ్రి కాళ్లు విరగొట్టిన మాయదారి కూతురు
ఇందుకోసం నలుగురు వ్యక్తులకు రూ.60వేల సుపారీ ఇచ్చి.. తన తండ్రి మీద దాడి చేసి.. కాళ్లు విరగ్గొట్టాలని కోరింది.
By: Tupaki Desk | 11 Aug 2023 4:49 AM GMTబంధాలు.. అనుబంధాలపై సరికొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చోటు చేసుకున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. సొంతకుటుంబీకులను తమ వ్యక్తిగత స్వార్థం కోసం బలి పెడుతున్న వైనాలు పెరుగుతున్న వేళ.. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలిస్తే.. ముక్కున వేలేసుకోవటమే కాదు.. మరీ ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నారన్న సందేహం కలుగక మానదు. తమ ప్రేమకు తన తండ్రి అడ్డు వస్తాడన్న సందేహంతో సుపారీ ఇచ్చి మరీ కాళ్లు విరగ్గొట్టించిన కూతురు ఘనకార్యం బయటకు వచ్చింది.
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని మధ తాలుకాకు చెందిన బడా వ్యాపారి మహేంద్ర షా. ఊళ్లో ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఎక్కువ. ఆయన కుమార్తె సాక్షి ప్రేమలో పడింది. చైతన్య అనే యువకుడ్ని ప్రేమించిన ఆమె.. తాను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి ఇంట్లో నుంచి పారిపోవాలని డిసైడ్ అయ్యింది. అయితే.. తన తండ్రి తన ప్రేమను అడ్డుకుంటారన్న ఆలోచనతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పెద్ద పన్నాగమే పన్నింది.
ఇందుకోసం నలుగురు వ్యక్తులకు రూ.60వేల సుపారీ ఇచ్చి.. తన తండ్రి మీద దాడి చేసి.. కాళ్లు విరగ్గొట్టాలని కోరింది. అలా చేస్తే.. తన తండ్రి తన ప్రేమను అడ్డుకోరన్న ప్లాన్ చేసింది. తాను అనుకున్న విధంగా జరగటం కోసం బయటకు వెళ్లిన ఆమె.. బస్టాండ్ నుంచి తనను పికప్ చేసుకోవటానికి షెట్ఫాల్ ప్రాంతానికి రావాల్సిందిగా కోరింది. కూతురి దుర్మార్గపు ఆలోచన తెలియని అమాయకపు తండ్రి కారులో వచ్చేశాడు.
ఊరికి తిరిగి వెళుతున్న వారి కారు మీద కుమార్తె రెఢీ చేసిన సుపారీ గ్యాంగ్ అడ్డుకుంది. నలుగురు వ్యక్తులు మహేంద్ర మీద దాడి చేశారు. ఆయన రెండు కాళ్లు విరగ్గొట్టి.. పదునైన ఆయుధంతో పొడిచేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాల పాలైన మహేంద్ర అరిచిన అరుపులకు స్థానికులు స్పందించారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడి ఉదంతం గురించి పోలీసులకు తెలిసినంతనే.. వారు రంగంలోకి దిగారు. దాడిపైన సందేహాలు వ్యక్తం చేసిన వారు. . తీగ లాగినంతనే.. లవ్ కోసం కూతురు చేసిన ఘన కార్యం బయటకు వచ్చింది. దీంతో.. మహేంద్ర మీద దాడి చేసిన నలుగుర్ని.. దాడి కుట్రలో భాగస్వామ్యం ఉన్న ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.