Begin typing your search above and press return to search.

ఇంటికి.. ఫ్యాక్టరీకి సోలార్ ప్యానెళ్లు.. ఎంత ఆదానో చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే!

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఇంధన రంగంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సోలార్ ప్యానెల్ ఏర్పాటుతో ఎంత లాభమో చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   14 March 2025 10:08 AM IST
ఇంటికి.. ఫ్యాక్టరీకి సోలార్ ప్యానెళ్లు.. ఎంత ఆదానో చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే!
X

సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటే ఎంత లాభమో చెప్పుకొచ్చారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. తన ఇంటికి.. ఆఫీసుకు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయటం ద్వారా భారీగా బిల్లు ఆదా అవుతుందని పేర్కొన్నారు. సోలార్ ప్యానెళ్ల మీద పెట్టుబడి నాలుగేళ్లలో తిరిగి వస్తుందన్న ఆయన.. పాతికేళ్లు ఇవి ఉంటాయని.. అప్పటివరకు వాటిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఇంధన రంగంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సోలార్ ప్యానెల్ ఏర్పాటుతో ఎంత లాభమో చెప్పుకొచ్చారు. దీనికి ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సోలార్ ప్యానెల్ లాభదాయకమని.. దానికి సంబంధించి ఎవరి వద్దైనా కేస్ స్టడీస్ ఉంటే చెప్పాలన్నారు. దీనికి స్పందించిన గద్దె.. తన ఉదాహరణే చెప్పుకొచ్చారు.

తన ఇంటికి రూ.6 లక్షలు ఖర్చు చేసి సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయించానని.. వీటికి ముందు కరెంటు బిల్లు నెలకు రూ.25 వేల వరకు వస్తుంటే.. అది కాస్తా రూ.4500లకు తగ్గినట్లుగా చెప్పారు. దీంతో ఆఫీసుకు కూడా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయించానని.. అప్పటివరకు వచ్చే రూ.12 వేల బిల్లు కాస్తా రూ.2 వేలు మాత్రమే వస్తుందని చెప్పారు. తనకున్న ఒక ఫ్యాక్టరీకి కూడా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయిస్తే రూ.60 లక్షలు ఖర్చుఅయ్యిందని.. అయితే.. దీనికి ముందు ప్రతి నెలా రూ.4 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు కరెంటు బిల్లు నెలసరి కట్టేవాళ్లమని.. అదిప్పుడు రూ.2.5 లక్షలకు పరిమితమైనట్లు చెప్పారు.

తనకున్న మరో ఫ్యాక్టరీకి కూడా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.కోటి ఖర్చు చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఆ ఫ్యాక్టరీకి నెలకు రూ.12 లక్షల వరకు కరెంటు బిల్లు కడుతున్నామని.. ప్యానెళ్ల ఏర్పాటు తర్వాత ఆ బిల్లు రూ.6 లక్షలకు తగ్గనున్నట్లు పేర్కొన్నారు. గద్దె రామ్మోహన్ రావు మాటలు వింటుంటే.. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుతో అంత ఖర్చు తగ్గుతుందా? అన్న ఆశ్చర్యంతో పాటు.. వీలైతే సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలన్న భావన కలుగక మానదు.