సూరీడే ఇంధనంగా ఎగిరే ఈ ‘విమానం’ లెక్కేంటి?
అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత ప్రజలకు మరిన్ని వసతుల్ని కల్పిస్తోంది
By: Tupaki Desk | 22 Aug 2024 5:30 AM GMTఅందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత ప్రజలకు మరిన్ని వసతుల్ని కల్పిస్తోంది. అలాంటి ప్రయోగం ఒకటి తాజాగా న్యూమెక్సికోలో గత వారం ఆవిష్కరించారు. పెద్దగా ప్రచారంలోకి రాని ఈ వెండి విమానంతో ఇంటర్నెట్ పరుగులు తీయించే సత్తా దీని సొంతం. చూసేందుకు విమానం మాదిరి కనిపించే ఈ సిల్వర్ ఫాయిల్ బుడగ.. టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణగా చెప్పాలి.
విమాన ఆకారంలో ఉండే పే..ద్ద బుడగ గాల్లో ఎగిరి ఉండటమే కాదు.. సూర్యశక్తిని ఇంధనంగా మార్చుకొని ఇంటర్నెట్ ను మారుమూల ప్రాంతాల్లో కూడా అందించేలా డిజైన్ చేసిన ఈ టెక్నాలజీ అద్భుతం ఆసక్తికరంగా మారింది. పగలంతా సౌరశక్తిని ఇంధనంగా మార్చుకొని రాత్రిళ్లు కూడా పని చేసేలా దీన్ని డిజైన్ చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను ఎందుకు అందివ్వకూడదన్న ప్రశ్నకు సమాధానంగా దీన్ని రూపొందించారు.
న్యూ మెక్సికోకు చెందిన ఏరో స్పేస్ కంపెనీ ‘స్కీయే’ కొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది. నిలువుగా నింగిలోకి ప్రయోగించే ఈ విమానం లాంటి వాహనం సముద్ర మట్టం నుంచి 60వేల నుంచి 65 వేల అడుగుల ఎత్తుకు వెళుతుంది. దీని ఉపరితలం మీద ఉండే గాలియం సెలీనైడ్.. గాలియం ఆర్సెనైడ్ సౌర ఘటాల శక్తి ద్వారా జీపీఎస్ సాయంతో నిర్దేశిత ఎత్తులో దీన్ని సంచరించేలా చేస్తారు.
దీని సాయంతో మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్.. ఇంటర్నెట్ ను ప్రసారమయ్యేలా చేస్తారు.దీని సాయంతో వాతావరణం.. పర్యావరణాన్ని పర్యవేక్షించటంతోపాటు.. అడవుల్లో మంటలు.. ఇతర విపత్తులను గుర్తించేందుకు వీన్ని వినియోగిస్తారు. దీనికున్న సోలార్ ప్యానల్స్ ద్వారా పగటివేళలో తనకున్న బ్యాటరీలను ఛార్జ్ చేసుకొని ఆ శక్తిని రాత్రివేళలో వినియోగించేలా డిజైన్ చేవారు.
పంద్రాగస్టు వేళ న్యూమెక్సికో కాలమానం ప్రకారం ఉదయం 7.36 గంటల వేళలో దీన్ని ప్రయోగించారు. నిర్దేశిత ప్రాంతంలో దాన్ని నిలిపి ఉంచి.. తర్వాతి రోజు మధ్యాహ్నం 12.21 గంటలవరకు అక్కడే ఉంచి పరీక్షించారు. ఇంటర్నెట్ సేవలు ఎలా వర్కు చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తించారు. అంచనాలకు తగ్గట్లే పని చేస్తున్న వైనంపై దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.