తెలుగు రాష్ట్రాల పంచాయితీలకు నిజమైన పరిష్కారం ఇదే
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కలిసి ఉండేలా రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రయత్నించటం లేదన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
By: Tupaki Desk | 6 July 2024 5:28 AM GMTవిడిపోయి కలిసి ఉందామన్న నినాదానికి తగ్గట్లే.. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కలిసి ఉండేలా రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రయత్నించటం లేదన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లోని ప్రజలు అరమరికలు లేకుండా కలిసిపోతున్న పరిస్థితి. ప్రజలకు లేని పంచాయితీలు ప్రభుత్వాలకు ఎందుకు ఉంటున్నాయంటే.. రాజకీయ అంశాలే కారణంగా చెప్పాలి.
భావోద్వేగ రాజకీయాల్ని నడిపే నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ చేసిన ఘనకార్యాలే ఇప్పుడు తలనొప్పులుగా మారాయన్న మాట వినిపిస్తోంది. విభజన అనంతరం తలెత్తిన పంచాయితీల్ని ఒక కొలిక్కి తీసుకురావాలన్న ఆలోచన కేసీఆర్ ఎప్పుడూ చేయలేదు. ఆ మాటకు వస్తే ఆ అంశాలపై ఆయనకు అంత ఆసక్తి కూడా లేదనే చెప్పాలి. లేదంటే.. పదేళ్ల గడువు పూర్తి అయ్యాక.. హైదరాబాద్ లోని కొన్ని భవనాలు తమ అధీనంలో ఉన్నవి తిరిగి ఇచ్చేస్తామని లేఖలు రాసినా స్పందించిన తీరును ఏమనాలి? ఎలా చూడాలి?
నిజానికి విభజన పంచాయితీ లెక్కలు తేలాలంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటే ఎప్పటికి లెక్క తేలదనే చెప్పాలి. ఎందుకుంటే.. ముందుచూపుతో.. స్నేహపూరిత వాతావరణంలో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆయా అంశాల్ని ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బ తీసేలా చేశారంటూ రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేయటం చేస్తారు. దీంతో.. అడుగు ముందుకు పడకుండా.. స్టేటస్ కో కొనసాగేందుకే మక్కువ చూపుతారన్న మాట వినిపిస్తోంది.
నిజానికి విభజన సమస్యల చిక్కుముళ్లను విప్పదీసే అవకాశం కేసీఆర్ కే ఉందని చెప్పాలి. కారణం.. పేచీ పెట్టేదే ఆయన అయినప్పుడు.. ఆయనే ఆ బాధ్యతను పూర్తి చేస్తే పంచాయితీనే ఉండేది కాదు. ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం ఏదైనా ఒక అడుగు ముందుకు వేసి.. వివాదాల్ని పరిష్కరించుకునేందుకు వీలుగా ఒక విషయంలో వెనక్కి తగ్గి.. మరో అంశంలో ఒక అడుగు ముందుకు వేస్తే.. నానా యాగీ చేసేందుకు కాచుకొని ఉన్నారు కేసీఆర్ అండ్ కో. అలాంటప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు రేవంత్ సర్కారు మరింత మొండిగా ఏపీ ముందు సాధ్యం కాని.. ఆచరణ వీల్లేని ఎజెండాను సిద్ధం చేసింది.
ఇలాంటి వాతావరణంలో జరిగే సమావేశం కారణంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతారే తప్పించి.. వారి భేటీ కారణంగా రెండు రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్న మాట వినిపిస్తోంది. నిజానికి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం మీద నిజమైన కమిట్ మెంట్ ఉంటే దానికో మార్గం ఉంది. కేంద్ర హోం మంత్రి, రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. విపక్ష నేతలతో ఒక కమిటీగా మారటం.. అందులో ఇద్దరు చొప్పున మంత్రులను రెండు రాష్ట్రాల వారు ఉండేలా చూడటంతో పాటు రెండు రాష్ట్రాల సీఎస్ లకు ఇందులో చోటు కల్పించాలి.
ఒక విధంగా చెప్పాలంటే సమస్యల్ని పరిష్కరించాలనే తలంపు నిజంగా ఉంటేనే ఈ తరహా కమిటీ ఏర్పాటు పెద్ద కష్టమైనది కాదు. నిజానికి విభజన పంచాయితీలకు అసలుసిసలు ఔషధం ఇదే అవుతుంది. రెండు రాష్ట్రాల్లోని కోట్లాది మంది తెలుగు ప్రజలకు మేలు చేసేందుకు అదే పనిగా నాన్చాల్సిన అవసరం లేదు. ఒకరు ఒక విషయంలో తగ్గితే.. మరొకరు ఇంకో విషయంలో తగ్గితే సరిపోతుంది. అంతే తప్పించి రాష్ట్ర ప్రయోజనాల పేరుతో కొత్త అంశాల్ని తెర మీదకు తీసుకొస్తే పంచాయితీ మరింత పెద్దది కావటమే తప్పించి.. పరిష్కారం లభించదు. ఇప్పుడు ప్రస్తావించిన కమిటీ ఏర్పాటు విషయానికి వస్తే.. ఇలాంటివి ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఇలాంటి ఐడియల్ కమిటీ ఏర్పాటును ఆశించటం అత్యాశే అవుతుంది. కాదంటారా?