భారత్ భవిష్యత్తు దర్శనం... జాబిల్లి మీద నివాసం!
దాంతో ఇపుడు ఇస్రో మరింత పెద్ద లక్ష్యాలతో ముందుకు వస్తోంది. దక్షిణ ధృవం మీద తొలి భారతీయుడు అడుగుపెట్టే శుభ ముహూర్తానికి రంగం సిద్ధం చేస్తోంది.
By: Tupaki Desk | 23 Aug 2023 6:22 PM GMTభారత్ ప్రపంచాన్ని అబ్బురపరచింది. ఇస్రో చేసిన ప్రయోగం యావత్తు విశ్వాన్ని భారత్ వైపు చూసేలా చేసింది. ఎవరూ అడుగు పెట్టలేని చోట భారత్ చంద్రయాన్ 3ని ప్రవేశపెట్టింది. చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఇస్రో టార్గెట్ చేసింది. ఎందుకు అంటే అక్కడ రాళ్ళు శిలలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో నీటి నిల్వలు అపారంగా ఉంటాయి.
నీరు ఉన్న చోట మనిషి జీవించగలడు. అలాగే అక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు. అంటే భవిష్యత్తు దర్శనంతోనే భారత్ ఈ ప్రయోగం చేసింది అని భావించాలి. ఈ రోజు అద్భుతమైన టాస్క్ ని ఇస్రో పూర్తి చేసింది. అయితే ఇంతకంటే పెద్ద లక్ష్యం ఈ ప్రాంతంలో మనిషిని ల్యాండ్ చేయడం. నిజానికి 1969లో అమెరికా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ని చంద్రుడి మీద కాలు మోపేలా చేసి హిట్ కొట్టింది.
ఇపుడు చీకటిగా ఉండే దక్షిణ ధృవం వద్ద మనిషిని పంపించడం ద్వారా ఎవరికీ సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేయాలన్నది ఇస్రో కోరిక. అది తొందరలోనే నెరవేరుతుంది అని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాధ్ ప్రకటించారు.
ఇస్రోకు ఇంతకంటే పెద్ద లక్ష్యాలు ఉన్నాయని ఆయన చెప్పడం వెనక ఉద్దేశ్యాలు ఇవే. ఇక నాసా కూడా చంద్రుడి దక్షిణ దృవం లో నీటి నిల్వలు ఉన్నట్లుగా గుర్తించింది. అయితే ఇప్పటిదాకా అక్కడ మాత్రం ఏ దేశం అడుగు పెట్టలేకపోయింది. ఆ రికార్డు మాత్రం భారత్ సొంతం చేసుకుంది.
దాంతో ఇపుడు ఇస్రో మరింత పెద్ద లక్ష్యాలతో ముందుకు వస్తోంది. దక్షిణ ధృవం మీద తొలి భారతీయుడు అడుగుపెట్టే శుభ ముహూర్తానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇపుడు చంద్రయాన్ ప్రయోగంతో అక్కడ ఉన్న మట్టిని పరిశీలించడంతో పాటు అక్కడ వాతావరణాన్ని అధ్యయనం చేయడం ద్వారా రానున్న రోజులలో మనిషి అక్కడ ఉండేందుకు అవసరం అయిన పరిస్థితులను పూర్తిగా శోధిస్తుంది.
దీంతో ఈ రోజు విక్రం ల్యాండర్ ల్యాండ్ అయిన ప్లేస్ లో రేపటి రోజున భారతీయుడు అడుగు పెట్టనున్నారు. ఆ రోజు కూడా తొందరలోనే అన్నది ఇస్రో పట్టుదల ప్రయోగాలను బట్టి తెలుస్తోంది. ఇక శుక్ర గ్రహం మీద కూడా ఇస్రో పరిశోధనలు చురుకుగా సాగనున్నాయి. అదే విధంగా అంగారకుని మీద కూడా పరిశోధనలు జరగనున్నాయి. ఇలా చాలా లక్ష్యాలను ముందు పెట్టుకుని ఇస్రో తన విజయానందాన్ని మరింత బాధ్యతగా వాడుకుంటోంది.