మిస్ కావొద్దు: వీరి మాటల్ని చదివితే పాజిటివ్ ఫీల్ పక్కా
అవును.. ఎవరు అవునన్నా.. కాదన్న మంచి మాటలు విన్నప్పుడు.. చదివినప్పుడు వచ్చే ఫీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలామందికి చాలా విషయాలు తెలిసినవే ఉంటాయి.
By: Tupaki Desk | 17 Sep 2024 8:30 AM GMTఅవును.. ఎవరు అవునన్నా.. కాదన్న మంచి మాటలు విన్నప్పుడు.. చదివినప్పుడు వచ్చే ఫీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలామందికి చాలా విషయాలు తెలిసినవే ఉంటాయి. కానీ.. తెలిసిన విషయాన్ని తెలియని కొత్త తరహాలో చెప్పటం.. వాటికి సరికొత్తగా పరిచయం చేసినప్పుడు నిజమే కదా? ఈ విషయాన్ని ఈ యాంగిల్ లో ఆలోచించలేదనే అనుకుంటాం. ఇప్పుడు అలాంటి అనుభూతే మీకు కలుగుతుంది. వివిధ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు చెప్పిన మాటల్ని చదివినప్పుడు కలిగే భావన ఒక్కటే. వారి మాటలు.. ఏ సందర్భంలో అయినా.. ఏ కాలంలో అయినా ఇట్టే ఫిట్ అయ్యేలా ఉండటమే కాదు.. మనసుకు.. మెదడుకు లాంగ్ రీఫ్రెష్ బటన్ ను నొక్కిన అనుభూతితో పాటు.. కొత్త ఉత్సాహం.. ఉత్తేజం కలుగుతుంది.
మానసిక ఆరోగ్య నిపుణుడైన జాన్ డెలోనీ మాటలు కొత్తగానే కాదు.. ఆయన చెప్పే ఉదాహరణలు లాజిక్ కు అంది.. నిజమే.. ఫాలో అయిపోదామన్నట్లుగా ఉంటాయి. బాధలోనూ.. ఒత్తిడిలోనూ ఉన్నప్పుడు ఎవరికి వారు తమను తాము తక్కువగా చేసుకోవటం మామూలే. ఇలాంటి వేళ ఇతగాడి మాటల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతడేమంటాడంటే.. ‘‘కారులో పెట్రోల్ అయిపోతే అదిక పనికి రాదని అనుకోం. మళ్లీ పెట్రోలో పోయించుకొని నడుపుతాం. సెల్ ఫోన్ లో చార్జింగ్ అయిపోతే దాన్ని పక్కన పడేయం.. తిరిగి ఛార్జింగ్ పెట్టుకొని వాడుతాం. మనుషులకు అదే వర్తిస్తుంది. బాధలోనూ.. ఒత్తిడిలో ఉంటే దేనికి పనికి రామని అనుకోవద్దు. కాస్త విశ్రాంతి తీసుకొని.. మనసు కుదుటపడ్డాక.. కొత్త ఉత్సాహంతో పోరాటం షురూ చేయాలి’ అంటూ చెప్పే మాటలు వెంటనే రీఛార్జి అయ్యేలా చేస్తుంది.
మనకు లభించే ప్రేమ విషయంలో ఎలా ఉండాలన్న దానిపై ఒక్కొక్కొరికి ఒక్కోలాంటి అభిప్రాయం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి అందే స్వచ్ఛమైన ప్రేమను కొందరు పట్టించుకోరు. మరికొందరు తమను ప్రేమించే వారిని పెద్దగా పట్టించుకోరు. కానీ.. అదెంత తప్పన్న విషయాన్ని ఐఏఎస్ అధికారి దివ్య మిత్తల్ మాటల్లో విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. ‘నిజమైన ప్రేమ ఆక్సిజన్ లాంటిది. అందుబాటులో ఉన్నంతసేపూ మనం దాని గురించి మర్చిపోతాం. అది పూర్తిగా మాయమైతే మాత్రంప్రాణాలతో ఉండలేం. కాబట్టి మీకు దక్కుతున్న ప్రేమకు మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండండి.
మారిన కాలానికి తగ్గట్లు మనం కూడా కొంత మారాలి. అప్పుడే అవకాశాల్ని అందిపుచ్చుకునే వీలు ఉంటుంది.మారటం అంటే.. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టమని కాదు. కాకుంటే.. పరిస్థితులకు తగ్గట్లు కొన్ని మార్పులు చేసుకోవచ్చు. వ్యాపారవేత్త పారస్ చోప్రా మాటల్ని వింటే అదెలానో ఇట్టే అర్థమవుతుంది. ‘‘మీ గురించి మీరు బాగా ప్రచారం చేసుకోండి. అదేమాత్రం తప్పు కాదు. తాము చేసే పని గురించి ఏం చెప్పకుండా మౌనంగా చేసుకుపోయే వారి కంటే తమ గురించి తమను తాము ప్రచారం చేసుకునే వారికే ఈ ప్రపంచంలో అవకాశాలు ఎక్కువగా దక్కుతాయి’’ అని చెప్పటం చూసినప్పుడు గెలుపు సూత్రాన్ని కొంత అర్థమవుతుందని చెప్పాలి.
మరో వ్యాపారవేత్త అంకుర్ వారికూ కూడా లైఫ్ స్కిల్ కు సంబంధించిన ఒక సూత్రాన్ని చెబుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే.. ‘‘ఆలోచనలు పక్కదారి పట్టనివ్వకుండా.. కష్టపడి పని చేయండి. మెరుగైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పర్చుకోండి. ఎలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేకుండాజీవితంలో ముందుకెళ్లొచ్చు’’ అని చెబుతారు. బయట ప్రపంచంతో ఎలా ఉండాలన్న మాటలకు తగ్గట్లే.. ఇంట్లో ఎలా ఉండాలి? అన్నింటికిమించి జీవితభాగస్వామితో ఎలా మెలగాలన్న దానిపై ఫిట్ నెస్ ఇన్ ఫ్లుయెన్సర్ గియా మకూల్ చెప్పే మాటలు అందరూ ఫాలో కావాల్సిందే.
ఆమె ఏం చెబుతారంటే.. మీ జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ అచ్చం మీలానే ప్రవర్తించాలని కోరుకోవద్దన్న సూచన చేస్తారు. ‘మీ అలవాట్లను బలవంతంగా తనపై రుద్దకండి. భార్యభర్తలు బలాలు..బలహీనతలు.. అలవాట్లు వేర్వేరుగా ఉండటం వల్ల నష్టమేమీ లేదు. మీ ఇద్దరికీ ఏది ఇష్టమో గుర్తించి.. దాన్ని జంటగాఅస్వాదించటం అలవాటు చేసుకోండి’’ అని చెబుతారు. రచయిత అన్నెలారె లీకున్ఫ్ మాటల్ని చదివినప్పుడు ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన కచ్ఛితమైన ఒక లైఫ్ స్కిల్ గురించి ఎంత బాగా చెప్పారనిపించక మానదు. ఆమె ఏమంటారంటే.. ‘‘మీ మనసులోకి కుతూహలాన్ని బయటకు వ్యక్తీకరించకపోవటం అంటే.. భూమిలో విత్తనాన్ని నాటి.. దానికి ఎప్పుడూ నీరు పోయకుండా వదిలేసినట్లే. ఏదైనా ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవాలని కుతూహలం కలిగితే.. అందుకోసం రోజుకు గంట చొప్పున టైం కేటాయించండి. ఆసక్తికర అంశానికి సంబంధించిన పుస్తకాన్ని కొనుక్కొని చదవండి. ఇతరుల్లో ఏదైనా అలవాటు నచ్చితే వారం పాటు మీరూ అలా చేసి చూడండి. ఏదైనా ఆలోచన ఉత్సుకత రేకెత్తిస్తే.. దాని గురించి ఇతరులతో మాట్లాడటం షురూ చేయండి’’ అని చెబుతారు. నిజమే కదా.. ఈ ఆరుగురు చెప్పిన విషయాలు.