మెరుపులు సరే.. మరకల మాటేంటి బాబూ.. !
అయితే.. ఈ మెరుపుల మాటున పడుతున్న మరకలను కూడా సీఎం గ్రహించాల్సి ఉంది.
By: Tupaki Desk | 18 Dec 2024 2:30 PM GMTరాష్ట్రంలో పెట్టుబడుల వరద పారుతోందని.. పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని.. సీఎం చంద్రబాబు చెబుతున్నారు. మంచిదే.. ఇది కావాల్సిందే కూడా. అంతేకాదు.. విజన్ 2047 అంటూ కూడా హడావుడి చేస్తున్నా రు. పది సూత్రాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథం దిశగా నడిపించనున్నట్టు కూడా ఢంకా భజాయిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో కూటమి సర్కారు ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నట్టు ఆయన చెప్పకనే చెబుతు న్నారు. అయితే.. ఈ మెరుపుల మాటున పడుతున్న మరకలను కూడా సీఎం గ్రహించాల్సి ఉంది.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు-అంటూ.. సీఎం చంద్రబాబు తరచుగా చెబుతుంటారు. ఇప్పుడు కూటమి సర్కారు విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. అది అభివృద్ది కావొచ్చు.. పరోక్షంగా ప్రజలపై పడుతున్న భారాలు కావొచ్చు. అభివృద్ధికంటే కూడా.. ప్రజలు సహించలేనిది.. భారాలనే. ఈ విషయమే వైసీపీని పుట్టిముంచింది. ఏడాదికి అమ్మ ఒడి పథకం కింద రూ.15000 ఇచ్చినా.. మహిళా సాధికారత పేరుతో బీసీ మహిళలకు రూ.18000 ఇచ్చినా తీసుకున్నారు.
అయితే.. ఇంత పెద్ద ఎత్తున వేల కోట్ల సొమ్మును ఇస్తున్నాం కదా.. రూ.100 చెత్తపన్ను కట్టలేరా? అని అప్పటి సీఎం జగన్ భావించారు. కడతారులే అనుకున్నారు. కానీ, ప్రజలకు ఇచ్చిన వేల కంటే కూడా.. నెలకు రూ.100 కట్టడం కష్టమైంది. అది.. ఎన్నికల సమయంలో అంతే ప్రభావం చూపింది. అదేసమ యంలో పేదలకు ఎక్కడెక్కడోభూములు ఇచ్చారు. దీనికి కూడా వందల కోట్లు ఖర్చు చేసారు. అయితే.. ఇదే సమయంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీని ఇరకాటంలోకి నెట్టింది.
అంటే.. ప్రజలకు మంచి చేయడం మంచిదే. కానీ, ఇదే సమయంలో సర్కారు బాదుడును కూడా ప్రజలు ఎక్కువగానే పరిగణిస్తున్నారన్న విషయం వైసీపీ విషయంలో స్పస్టమైంది. ఇప్పుడు కూటమికి కూడా ఇదే పరిస్థితి వస్తోందన్న సంకేతాలు వస్తున్నాయి. బాదుడు ఇప్పుడు మామూలుగా లేదంటే.. ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ ఏ నలుగురు కూర్చున్నా.. కూటమి సర్కారు బాదుడుపైనే చర్చ సాగుతోంది. ఆరు మాసాల్లోనే ప్రభుత్వం వసూలు చేస్తున్న అదనపు బాదుడు లెక్కలు జోరుగానే వినిపిస్తున్నాయి. వీటి విషయంలో చంద్రబాబు నియంత్రణ పాటించకపోతే.. ఇబ్బంది తప్పదు.
ఇవీ బాదుళ్లు..
+ రెండు పెరిగిన విద్యుత్ చార్జీలు
+ కూరగాయల ధరలు
+ కందిపప్పు కిలో కు రూ.12-15 చొప్పున పెంపు
+ వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ల బాదుడు
+ ఇప్పటికే పెరిగిన ఇంటి పన్నులు, కుళాయి పన్నులు
+ ప్రైవేటు పాఠశాలల పీజుల నియంత్రణ ఎత్తేయడం
+ ప్రతి పనికీ పెరిగిపోయిన అవినీతి.