Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదిలో వారి నుంచి జగన్ కు షాకులు తప్పవా?

జనసేన ముఖం చూడని నేతలు ఇప్పుడు.. ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 2:30 PM GMT
కొత్త ఏడాదిలో వారి నుంచి జగన్ కు షాకులు తప్పవా?
X

పొద్దుతిరుగుడు పువ్వుకు.. తెలుగు ప్రజాప్రతినిధులకు పెద్ద తేడా లేకుండా పోయిందన్న పోలిక ఈ మధ్యన బలంగా వినిపిస్తోంది. గతానికి భిన్నంగా కొన్నేళ్లుగా ఒక దరిద్రపుగొట్టు సంప్రదాయం తెలుగు ప్రజాప్రతినిధుల్ని పట్టి పీడిస్తోంది. అధికారం ఎటువైపు ఉంటే.. అటు వైపు మొగ్గే రీతిలో నేతలు ఉంటున్నారు. అదికారమే పరమావధిగా మారింది. గతంలో మాదిరి.. పార్టీ.. సిద్దాంతాలు.. ఆదర్శాలు లాంటివి కాలం చెల్లిన మాటలుగా మారాయి. మొన్నటి ఎన్నికల ముందుకు వరకు చంద్రబాబు.. జనసేన ముఖం చూడని నేతలు ఇప్పుడు.. ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

నిజానికి ఎన్నికల సమయంలో జనసేన పార్టీ పాతిక మంది వరకు అభ్యర్థులను నిలబెట్టాలని భావించింది. కానీ.. తాము కోరుకున్న స్థాయిలో నేతలు లేకపోవటం.. వారిని బరిలోకి దించటం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించిన జనసేనాని.. ముందుగా చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా తక్కువ మంది అభ్యర్థులను బరిలోకి దింపటాన్ని మర్చిపోలేం. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ను అభినందించాల్సిందే. ఎందుకంటే.. బలం ఉన్నా లేకున్నా.. తమ ఉనికిని బలంగా చాటుకోవటం కోసం పార్టీ తరఫున అభ్యర్థుల్ని దింపి.. ఓటమికి వెల్ కం చెప్పే కన్నా.. తాము సత్తా చాటే స్థానాల్ని తీసుకోవటమే ఉత్తమం. ఈ విషయంలో పవన్ చాలా క్లారిటీతో ఉన్నారని చెప్పాలి. గెలుపు మాత్రమే తప్పించి.. ఇంకేమీ అవసరం లేదన్నట్లుగా వ్యవహరించిన దానికి ప్రతిగా వంద్ శాతం స్ట్రైకింగ్ రేటుతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న కూటమి నేతల ఆనందం అంతా ఇంతా కాదని చెప్పాలి. అదే సమయంలో.. ఊహించేందుకు సైతం మనసు ఒప్పుకోని ఓటమి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది. వైనాట్ 175స్థానం. కేవలం 11 స్థానాలకే పరిమితం కావాల్సిన దుస్థితి. మారిన రాజకీయ బలాల నేపథ్యంలో ఓటమి ఎదురైన కొద్ది రోజుల నుంచే వైసీపీనీ వదిలి.. కూటమిలోని టీడీపీ.. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవటానికి వైసీపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు.

అలా మొదలైన ప్రవాహం.. నాన్ స్టాప్ గా సాగుతూనే ఉంది. ఒకరు తర్వాత మరొకరు అన్నట్లుగా వైసీపీని వదిలేసి వెళ్లిపోతున్న నేతల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇదిలా ఉండగా.. కొత్త సంవత్సరంలో పార్టీని విడిచే నేతలతో జగన్ కు షాకుల మీద షాకులు తప్పవని చెబుతున్నారు. కూటమిలోని తెలుగుదేశం.. జనసేనల్లో ఏదో ఒక పార్టీలో చేరేందుకు వైసీపీకి చెందిన నేతలు పలువురు ఆసక్తి చూపుతున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా.. మండలి సభ్యులు.. రాజ్యసభ సభ్యుల్లో పలువురు పార్టీ మారటం ద్వారా జగన్ కు షాకులు ఇవ్వటం ఖాయమంటున్నారు.

ఎందుకంటే.. మండలిలో అధికార కూటమి పార్టీలకు బలం లేని నేపథ్యంలో.. పార్టీ మారటం ద్వారా తమ బలాన్ని అధికార పార్టీకి ఇవ్వాలన్న యోచనలో నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. కొత్త సంవత్సరం వస్తున్న ఉత్సాహం కంటే.. ఆ సందర్భంగా ఎదురయ్యే సవాళ్లే వైసీపీ అధినాయకత్వాన్ని వేధిస్తున్నట్లుగా చెబుతున్నారు. పార్టీని వదిలి వెళ్లే వారి విషయంలో ఎక్కువ మధనం కంటే కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్లానింగ్ మీద ఫోకస్ అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. జగన్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.