సీఎంపై రాయి దాడి.. టీడీపీ నేత చుట్టూ పోలీసుల వల!
కానీ.. ఇంతలోనే ఈ కేసు టీడీపీ నేత వైపు మళ్లిందనే వాదన వినిపిస్తోంది.
By: Tupaki Desk | 17 April 2024 8:33 AM GMTఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై విజయవాడ శివారులోని సింగ్‌నగర్లో జరిగిన రాయి దాడి ఘటన సంచ లనాల దిశగా కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకితీసుకుని విచారిస్తు న్నారు. వీరంతా 17 ఏళ్లలోపు వారేనని తెలుస్తోంది. వీరిలో సురేష్ అనే యువకుడు.. ఈ రాయిని నేరుగా సీఎం జగన్‌కు తగిలేలా విసిరారని పోలీసు వర్గాల కథనం. అయితే.. ఇదిఇంకా విచారణ దశలోన ఉన్న నేపథ్యంలో దీనిపై స్పష్టత రావడం లేదు. కానీ.. ఇంతలోనే ఈ కేసు టీడీపీ నేత వైపు మళ్లిందనే వాదన వినిపిస్తోంది.
జగన్‌పై రాయి దాడి జరిగిన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బొండా ఉమా మహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అయితే.. ఈయన ప్రోద్బలంతోనే యువకులు రెచ్చిపోయి దాడి చేశారనేది పోలీసుల నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఒక్కసారిగా రాజకీయం భగ్గుమంది. టీడీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడిని అరెస్టు చేసి.. అతన్ని చిత్రహింసలకు గురి చేసి.. తద్వారా.. ఈ కేసును టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు నుంచి.. ఇతర నాయకుల వరకు కూడా.. రాయి దాడి ఘటనలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బొండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పటికే కొందరు నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు కూడా చేసేశారు. ఇది అనుచితమని.. బొండా ఉమాను ఇరికిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. భద్రత కల్పించడంలో విఫలమైన అధికారులను తక్షణం బదిలీ చేయాలని వారు కోరుతున్నారు. మరి దీనిపై పోలీసులు, ఎన్నికల అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.