"ఎవడో.. పీకే అంట!"- గుర్తుందా బాబూ!!
వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయం దక్కించుకుని తీరాలన్న కసితో చంద్రబాబు పీకేతో పొత్తుకురెడీ అయ్యారు.
By: Tupaki Desk | 23 Dec 2023 3:36 PM GMTఐదేళ్ల కిందట ఎవరితో అయితే వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ చెలిమి చేశారో.. అదే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉరఫ్ పీకేతో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చేతులు కలిపారు. స్వయంగా ఆయనను ఇంటికి పిలిపించుకుని మరీ చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయం దక్కించుకుని తీరాలన్న కసితో చంద్రబాబు పీకేతో పొత్తుకురెడీ అయ్యారు. ఎన్నికల సరళిని అంచనా వేయడం, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలనే వ్యూహాలను సంసిద్ధం చేసుకోవడం వంటవి ఇక, పీకేతో కలిసి బాబు తీసుకోనున్నారనేది సుస్పష్టం.
వాస్తవానికి పీకేతో గత ఎనిమిది నెలల కిందటే చంద్రబాబు ఫోన్‌లో సంప్రదించారనే వార్తలు వచ్చాయి. ఇక, అప్పటి నుంచి బాబు వైఖరిలోనూ మార్పు కనిపించింది. నిజానికి ప్రస్తుతం టీడీపీకి మేధో సేవలు అందిస్తున్నది కూడా ప్రశాంత్ కిషోర్ టీంలోని రాబిన్ శర్మ అన్న విషయం తెలిసిందే. చిత్రం ఏంటంటే.. గత ఎన్నికల్లో జగన్ పంచన ఉన్న పీకే..ఇప్పుడు చంద్రబాబు పంచకు చేరారు అంతే తేడా! సో.. మొత్తానికి రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రులు ఉండరన్నట్టుగా.. ఇప్పుడు సలహాదారులు, వ్యూహ కర్తల విషయంలోనూ ఇదే ఫార్ములా వర్కవుట్ అవుతోందని అనుకోవాలి!.
కట్ చేస్తే.. జనాలు మామూలోళ్లు కాదు కదా! మనం మరిచిపోయి చేతులు దులిపేసుకున్నా.. పాత సంగతులు మాత్రం ప్రజలు పుంఖాను పుంఖాలుగా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇలానే ఇప్పుడు చంద్రబాబు పీకేతో జత కట్టిన తర్వాత.. ఇదే విషయం చర్చకు వస్తోంది. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇదే పీకేపై చేసిన విమర్శలు.. వైసీపీపై విసిరిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"ఎవడో పీకే అంట. ఉత్తరాది వాడు. అతనొచ్చి.. ఏపీ ప్రజలకు ఏం చేయాలో చెప్తాడు. ఏపీ ప్రజలు ఎలా ఉండాలో నేర్పిస్తాడు. ఇదీ.. వైసీపీ పరిస్థితి. ఏపీ ప్రజలను ఆదుకునేందుకు అరువు తెచ్చుకున్న సలహాలను పాటిస్తారట. ప్రజలకు సేవ చేసేందుకు టీడీపీ పుట్టింది. టీడీపీకి ఇతర రాష్ట్రాలకు చెందిన వారి సలహాలు అక్కరలేదు. ప్రజల సేవకోసం.. ప్రజల నుంచి పుట్టిన పార్టీ. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. "ఇదీ చంద్రబాబు చేసిన వ్యాఖ్య. అంతేకాదు..తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పీకే వ్యూహాలను ఆయన ఎండగట్టారు. కానీ, ఇప్పుడు అదే పీకేతో ఆయన జత కట్టారు. దీనిపైనే నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు.