Begin typing your search above and press return to search.

కూటమిలో కెమిస్ట్రీ మిస్...!?

అలాగే రాజకీయ వంటకం పండాలన్నా అన్ని రాజకీయ పార్టీల మధ్య సయోధ్య ఉండాలి.

By:  Tupaki Desk   |   31 March 2024 2:45 AM GMT
కూటమిలో కెమిస్ట్రీ మిస్...!?
X

ఎంతో ఆర్భాటంగా గెలుపుని టచ్ చేయాలని టార్గెట్ ని రీచ్ కావాలని ఏపీలో కట్టిన కూటమిలో అసలైన మసలా దినుసు మిస్ అవుతోంది అని చర్చ సాగుతోంది. ఏ వంటకం రుచికరంగా తయారు కావాలంటే దినుసులు అన్నీ సమపాళ్ళలో ఉండాలి. అపుడే అది పండుతుంది. అలాగే రాజకీయ వంటకం పండాలన్నా అన్ని రాజకీయ పార్టీల మధ్య సయోధ్య ఉండాలి.

కానీ ఏపీలో చూస్తే టీడీపీ కూటమిలో కీలకమైన అంశమే మిస్ అవుతోంది అని అంటున్నారు. అదే పెద్ద లోటుగా చెబుతున్నారు. సయోధ్య అన్నది ఉండాలి. సర్దుబాటు ఉండాలి. పరస్పరం నమ్మకం ఉండాలి. ఉమ్మడి అజెండా ఉండాలి, ఏకోన్ముఖమైన అజెండా ఉండాలి. కానీ టీడీపీ కూటమిలో చూస్తే అన్ని పార్టీలు కలిసింది సీట్లు పంచుకోవడానికా అన్నట్లుగానే ఉంది అని అంటున్నారు.

ప్రజా సంక్షేమం కోసమే ఈ కూటమి అని చెబుతున్నా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు రావడంలేదు. పైగా ఈ కూటమి ఏర్పాటు బహు తమాషాగా ఉంది అని అంటునారు. బీజేపీతో ఉంటూ జనసేన కూటమిలో కలిసింది. దాని కంటే ముందు వారాహి యాత్రలో పవన్ ఎన్నికల మ్యానిఫేస్టో అనకపోయినా కొన్ని కీలక హామీలు జనాలకు ఇచ్చారు. గత ఏడాది మహానాడులో మినీ ఎన్నికల మ్యానిఫేస్టోని టీడీపీ రిలీజ్ చేసింది. అందులో సూపర్ సిక్స్ అంటూ ఉచిత పధకాలే ఎక్కువగా ఉన్నాయి.

బీజేపీ చూస్తే ఉచిత పధకాలకు వ్యతిరేకం అని అంటారు. మరి టీడీపీ ఉచిత హామీలకు బీజేపీ ఓకేనా అంటే దాని మీద స్పష్ట లేదు. బీజేపీ ఏ హామీ ఇస్తుందో కూడా తెలియదు. అదే విధంగా ప్రజా సంక్షేమం కోసమే బీజేపీతో పొత్తు అని టీడీపీ అంటున్నపుడు అందులో ప్రజలకు పనికివచ్చే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ప్రత్యేక హోదా అమలు, విభజన హామీలను నెరవేర్చడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఇత్యాది అంశాల మీద టీడీపీ బీజేపీ స్పష్టత ఇవ్వాలి కదా అన్న చర్చ వస్తోంది.

మరో వైపు చూస్తే టీడీపీ అధినాయకత్వం వైసీపీని జగన్ ని గట్టిగా టార్గెట్ చేస్తోంది. అదే బీజేపీ మాత్రం ఆ విషయంలో లైట్ తీసుకుంటోంది. బీజేపీ రాజకీయ అజెండా ఏమిటి అన్నది కూడా ఇక్కడ చూడాల్సి ఉంది అని అంటున్నారు. బీజేపీ కూటమిలోకి వస్తే కచ్చితంగా చాలా అంశాలు విభజన హామీలు జనం నుంచి ప్రశ్నలుగా వస్తాయి. వాటి మీద ఈ రోజు వరకూ ఏ మాత్రం చెప్పకుండా మేమంతా ఒక్కటీ అని చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది అని ప్రశ్నిస్తున్నారు.

ఇక కూటమిగా ఏపీకి ఫలనా మేలు చేస్తామని చెప్పాలి. ఎంతసేపూ జగన్ మీద విమర్శలు తప్పించి కూటమి అధికారంలోకి వస్తే ఏపీని కేంద్ర సాయంతో విభజన గాయాలు లేకుండా చూస్తామని నిర్మాణాత్మకమైన హామీలు ఇవ్వలేక పోతున్నారు అన్నది కూడా ఉంది. ఇంకో వైపు చూస్తే తెలుగుదేశం 144 సీట్లలో పోటీ చేస్తోంది. బీజేపీకి 10 సీట్లు పొత్తులలో భాగంగా ఇచ్చారు. జనసేనకు 21 సీట్లు ఇచ్చారు. అయితే ఈ సీట్లలో కూడా సర్దుబాట్లు సరిగ్గా లేవని అంటున్నారు.

మూడు పార్టీలలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. తమకు అవకాశాలు లేవని ఆశావహులు మూడు పార్టీలలో గగ్గోలు పెడుతున్నారు. నాయకుల స్థాయిలో పొత్తుల విషయంలో బాగానే ఉందని పించుకున్నా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం సెట్ కావడం లేదు అని అంటున్నారు. మిత్రులుగా గ్రౌండ్ లెవెల్ లో సాటి పార్టీని భావించే పరిస్థితి లేకపోవడం వల్లనే ఒక పార్టీకి టికెట్ ఇస్తే రెండవ పార్టీ వారు వీధుల్లోకి వస్తున్నారు అని అంటున్నారు.

జనసేన టీడీపీ ఎప్పటి నుంచో పొత్తులలో ఉంటామని చెబుతూ ఉన్నా ఆ రెండు పార్టీల మధ్యనే అవగాహన లేకుండా పోయిందని అంటున్నారు. ఇక కొత్తగా చివరి నిమిషంలో వచ్చి బీజేపీ చేరడం వల్ల గందరగోళం మరింతగా పెరిగిందని అంటున్నారు. మరి కేవలం నలభై రోజులు మాత్రమే ప్రచారానికి వ్యవధి ఉన్న వేళ తలో దారి అన్నట్లుగా కూటమి వైఖరి ఉంటోందని అంటున్నారు. అదే విధంగా కూటమిలో కెమిస్ట్రీ వర్కౌట్ కాకపోతే అనుకున్న టార్గెట్ ని రీచ్ కాలేరు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.