సోము వీర్రాజు మంత్రి అవుతున్నారా ?
ఇపుడు చూస్తే సోము వీర్రాజుని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి బీజేపీ తన చాయిస్ ఏంటి అన్నది నిరూపించుకుంది. సోము వీర్రాజు విషయానికి వస్తే ఆరెస్సెస్ నుంచి పార్టీలోకి వచ్చిన వారు.
By: Tupaki Desk | 11 March 2025 12:00 AM ISTబీజేపీలో ఉన్న గొప్పతనం అదే. ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతలను ఎప్పటికీ ఆ పార్టీ వదులుకోదు. పైగా ప్రోత్సహిస్తుంది. పదవులు ఏరి కోరి మరీ వారికే ఇస్తుంది. కేంద్ర మంత్రి పదవిని అలాగే బీజేపీలో మొదటి నుంచి ఉంటూ ఆరెస్సెస్ ఆశీస్సులు ఉన్న శ్రీనివాస వర్మకు ఇచ్చింది బీజేపీ.
ఇక ఏపీలో చూస్తే బీజేపీలో మొదటి నుంచి ఉంటూ ఆ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ వస్తున్న సత్య కుమార్ యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చింది. ఇపుడు చూస్తే సోము వీర్రాజుని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి బీజేపీ తన చాయిస్ ఏంటి అన్నది నిరూపించుకుంది. సోము వీర్రాజు విషయానికి వస్తే ఆరెస్సెస్ నుంచి పార్టీలోకి వచ్చిన వారు.
నాలుగున్నర దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన వారు. ఆయనను 2015లో కూడా ఒకసారి బీజేపీ ఎమ్మెల్సీగా చేసింది. ఇపుడు రెండవసారి చాన్స్ దక్కింది. నిజానికి సోము వీర్రాజుకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి ఉంది. ఆయన కోరుకున్న రాజమండ్రి అర్బన్ సీటు దక్కకపోవడంతో ఆయనను వేరే చోటకు పంపించాలని అనుకున్నారు. దానికి ఆయన నో చెప్పారని టాక్.
ఆ సమయంలోనే ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇక సోము వీర్రాజుకు కేంద్ర బీజేపీ పెద్దల వద్ద పలుకుబడి ఏ స్థాయిలో ఉందో ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరుని ఎంపిక చేయడంతోనే అర్ధం అయింది అని అంటున్నారు. సోము వీర్రాజుకు ప్రధాని మోడీ సహా కేంద్ర పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన నిస్వార్ధంగా పార్టీ కోసం సేవ చేస్తున్నారని కూడా వారికి తెలుసు.
అందుకే ఆయనకు సమయం వచ్చినపుడల్లా తగిన అవకాశాలను ఇస్తున్నారు. 2020 నుంచి 2022 దాకా సోము వీర్రాజు బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా చేశారు. ఆ సమయంలో ఆయన పార్టీని సొంతంగా ఎదిగేందుకు కృషి చేశారు. ఆ సమయంలో టీడీపీతో పొత్తు లేదు. దాంతో సోము టీడీపీని వైసీపీని కలిపి మరీ విమర్శలు చేశారు. టీడీపీని అయితే అసలు ఎక్కడా స్పేర్ చేయలేదు.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు టీడీపీ నేతలకు సోము వీర్రాజు అంటే కొంత భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. కానీ బీజేపీ పెద్దలు తమ వ్యూహం ప్రకారమే నాడు సోము చేత అలా చేయించారని అంటారు. జనసేన ప్లస్ బీజేపీ కాంబోని ఏపీలో ముందుకు తీసుకుని వెళ్ళమని నాడు వారే చెప్పారని కూడా అంటారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అది వర్కౌట్ కాదని భావించే పురంధేశ్వరిని తెచ్చి పార్టీ ప్రెసిడెంట్ గా చేశారు.
అలా ఒక వ్యూహం ప్రకారమే సోముని పక్కన పెట్టారు తప్పించి ఆయన పట్ల వేరే నెగిటివ్ ఒపీనియన్ తో కాదని అంటున్నాదు. అది ఇపుడు సోము ఎంపిక ద్వారా అర్ధం అయింది అని అంటున్నారు. ఇక చూస్తే సోము వీర్రాజు మరోమారు మండలిలో తన గొంతుకను విప్పబోతున్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా అన్నది కూడా ఇదే సమయంలో చర్చకు వస్తోంది.
నిజానికి నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నపుడు 2014లో రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇపుడు చూస్తే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. మండలిలో సోము ఉన్నారు. దాంతో అసెంబ్లీ నుంచి ఎటూ సత్యకుమార్ యాదవ్ కి చాన్స్ ఇచ్చినందువల్ల సోముకు మండలి నుంచి మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది.
జనసేనకు నాలుగు మంత్రి పదవులు నాగబాబుతో కలిపి అయితే బీజేపీకి కనీసం రెండు ఇవ్వాలన్న డిమాండ్ వస్తుంది. ఎటూ బీజేపీ పెద్దలు టీడీపీ వద్ద తమ మాటను నెగ్గించుకోగలుతున్నారు. ఆ విధంగా చూస్తే సోముకు మంత్రి పదవి ఇప్పించుకోవడం ద్వారా కోస్తా జిల్లాలలో బలమైన సామాజిక వర్గం నుంచి ఒక బలమైన గొంతుకను వినిపించాలని చూస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఏపీ రాజకీయాల్లో అంతగా వినిపించని బీజేపీ గొంతుకను సోము వీర్రాజు ద్వారా వినిపించాలన్న ఆలోచన కూడా దీని వెనక ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.