కేసీఆర్ ను బండ బూతులు తిట్టిన సోము.. జగన్ పైనే అదే ఫైర్
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన సోము వీర్రాజు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.
By: Tupaki Desk | 24 March 2025 1:32 PM ISTఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన సోము వీర్రాజు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ను టార్గెట్ చేస్తూ నోటికి పనిచెప్పారు. జగన్ కంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై కాస్త కటువుగానే వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి కాస్త అనుకూలంగా ఉంటారని ప్రచారం ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ సోము..ఈ స్థాయిలో మాటలతో రెచ్చిపోవడం బీజేపీతో సహా ఇతరపార్టీల వారిని షాక్ కు గురిచేసింది. ఉన్నట్టుండి సోము ఈ రేంజిలో మాట్లాడటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను గుంటనక్క అంటూ తుల నాడిన ఎమ్మెల్సీ సోము, ఏపీ మాజీ సీఎం జగన్ ను వదలలేదు. వైసీపీని ఖాళీ చేసి జగన్ సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేతలపై రెండు రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సోము కౌంటర్ అటాక్ చేశారు. రాత్రిపూట నిద్రపోని, ఊగిపోయే గుంటనక్క కేసీఆర్ అంటూ తీవ్ర పదజాలంతో తిట్టిపోశారు. కేసీఆర్ కొడుకు, కూతురు, మేనల్లుడి అభివృద్ధినే కేసీఆర్ కోరుకుంటారని వ్యాఖ్యానించారు.
కల్లబొల్లి కబుర్లు చెప్పి కేసీఆర్ తెలంగాణను పదేళ్లు పాలించారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. కేసీఆర్ మాయ మాటలను జనం నమ్మక పోవడం వల్లే గత ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పారన్నారు. బీజేపీ నేతలను గుంటనక్క అన్న కేసీఆర్ తిరిగి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, వైసీపీ అధినేత జగన్ పైనా ఎమ్మెల్సీ సోము తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 శాతం ఓట్లు కూడా పడకుండా చేస్తామని హెచ్చరించారు. మళ్లీ సీఎం అవుతానని జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షం శాసనసభకు వెళ్లడం లేదని, ప్రజలు ఇవ్వని హోదా కావాలని డిమాండ్ చేయడాన్ని సోము ఎత్తిచూపారు. 2014లో ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు జగన్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లలేదని నిలదీశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం విడ్డూరంగా ఉందన్నారు.