జగన్ తో రహస్య స్నేహం : సోము వీర్రాజు కామెంట్స్ ఇవే..
దీంతో వీర్రాజు తొలిసారిగా స్పందించారు. తనకు మాజీ సీఎం జగన్ కు మధ్య ఉన్న బంధంపై క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 11 March 2025 5:00 PM ISTఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో తనకు రహస్య స్నేహం ఉందనే ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు స్పందించారు. బీజేపీ కోటాలో ఆయన నామినేషన్ వేయడంతో టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో వైసీపీకి అనుకూలంగా సోము వీర్రాజు వ్యవహరించారంటూ టీడీపీ సోషల్ మీడియా ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో వీర్రాజు తొలిసారిగా స్పందించారు. తనకు మాజీ సీఎం జగన్ కు మధ్య ఉన్న బంధంపై క్లారిటీ ఇచ్చారు.
మాజీ సీఎం జగన్మోహనరెడ్డితో తనకు ఎలాంటి రహస్య స్నేహం లేదా ఒప్పందం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారమంతా కేవలం ఆరోపణలుగానే ఆయన కొట్టిపడేశారు. సీఎం అయిన తర్వాతే జగన్ తో తనకు పరిచయం అయిందని వెల్లడించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలకు సోము వీర్రాజు స్పష్టం చేశారు. కొన్ని విధాన నిర్ణయాలపైనే చంద్రబాబుపై విమర్శలు చేశానని, వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. అంతేకాకుండా తాను అమరావతికి వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాజధాని అమరావతికి తాను గతంలోనే మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇక ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత బీజేపీ కోటాలో రాష్ట్ర మంత్రివర్గంలో సోము చేరికపైనా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. చంద్రబాబు గత ప్రభుత్వంలోనే తనకు మంత్రిగా పనిచేయమని ఆఫర్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతానికి తాను మంత్రి అయ్యే ప్రతిపాదన ఏదీ లేదన్నారు. మంత్రి పదవిపై జరుగుతున్న ప్రచారం అంతా వదంతులేనని కొట్టిపడేశారు. చంద్రబాబుతో భవిష్యత్ బంధంపైనా సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మధ్య ఎలాంటి సంబంధం ఉందో.. ఇకపై తాను కూడా చంద్రబాబుతో అదే స్థాయిలో అనుబంధం కొనసాగిస్తానని చెప్పారు.
ఇక కూటమి తరఫున మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఐదు ఖాళీలకు ఐదుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ తరఫున సోము వీర్రాజు, జనసేన తరఫున నాగబాబు నామినేషన్లు వేయగా, టీడీపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఐదుగురు అభ్యర్థుల్లో బీజేపీ నేత వీర్రాజు ఎంపికే రాజకీయ వర్గాలను ఆకర్షించింది. గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన సోము వీర్రాజు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. దీంతో భవిష్యత్తులోనూ ఆయన నడవడికపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కనిపిస్తోంది.