అంబానీ ఫ్యామిలీ సెక్యూరిటీ వెనుక ఇంత ప్లానింగ్?
ప్రపంచంలోటాప్ 10 సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి 2023 నుంచి కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పించింది.
By: Tupaki Desk | 13 July 2024 1:26 PM GMTకాసిన్ని డబ్బులు సంపాదించినంతనే ‘రక్షణ’ గురించి ఆలోచించుకోవటం.. దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవటం మామూలే. తన గురించి మాత్రమే కాదు తన కుటుంబ భద్రతకు పెద్దపీట వేయటం కనిపిస్తుంది. సాదాసీదా వ్యక్తే ఇంతలా ప్లాన్ చేసుకున్నప్పుడు.. అపర కుబేరుడు.. లక్షల కోట్లకు అధిపతి.. ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ తమ భద్రత గురించి ఎంతలా ఆలోచిస్తారు? ఆయన చేసే వ్యాపారాలు.. ఆయనకున్న ఆస్తుల నేపథ్యంలో వాటిని భద్రంగా చూసుకునేందుకు ఎలాంటి వ్యవస్థ ఉంది? ప్రభుత్వం ఇచ్చే భద్రతతో పాటు తమ వ్యక్తిగత ఏర్పాట్లు ఏం చేసుకున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే నోరెళ్లబెట్టాల్సిందే.
ప్రపంచంలోటాప్ 10 సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి 2023 నుంచి కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పించింది.ఇందులో భాగంగా పది మందికి పైగా ఎన్ ఎస్ జీ కమాండోలు.. పోలీసు సిబ్బంది.. సీఆర్ఫీఎఫ్ సిబ్బంది ఉంటారు. ముకేశ్ అంబానీ దేశ.. విదేశాల్లో ఎక్కడ పర్యటించినా కూడా ఆయనకు భద్రత కల్పిస్తుంటారు. కేంద్రం ఆయన భద్రత విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతలా ఉంటాయి.
ఇక.. తన కుటుంబానికి.. తన సంస్థలకు సంబంధించిన భద్రత కోసం ముకేశ్ ప్లానింగ్ తర్వాతి లెవల్లో ఉంటుందని చెప్పాలి. ఎవరి అంచనాలకు అందని రీతిలో ఉండే ఈ ప్లానింగ్ గురించి తెలిస్తే.. అందుకే ఆయన అంబానీ అయ్యారనుకోకుండా ఉండలేం. అంబానీ కుటుంబ సభ్యులతో పాటు వారికున్న ఆస్తుల పరిరక్షణ కోసం భారీ ఎత్తున భద్రత ఉంది. ఆ మాటకు వస్తే అంబానీ కుటుంబ సభ్యుల్ని టచ్ చేసేందుకు చిన్న చీమ కూడా లోపలకు వెళ్లలేని కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని చెబుతారు. తమ కుటుంబాన్ని.. ఆస్తుల్ని.. కంపెనీలను రక్షించేందుకు.. భద్రంగాచూసుకునేందుకు ఒక భారీ సెక్యూరిటీ కంపెనీనే స్థాపించిన వైనం తెలిసినప్పుడు కాస్తంత ఆశ్చర్యానికి గురి కాకుండా ఉండలేరు.
భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముకేశ్ అంబానీ రిటైర్డు ఆర్మీ సైనికుల మీద భారీ బాధ్యతను పెట్టినట్లుగా చెబుతారు. ఇందుకోసం గ్లోబల్ కార్పొరేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో జాబ్ చేసే ప్రతి ఒక్కరి బ్యాక్ గ్రౌండ్ లోనూ ఆర్మీ పని చేసిన వారే ఉండటం కనిపిస్తుంది. ఏ పనికి అయినా ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సిందే. అలా లేనోళ్లకు ఎంట్రీ కూడా ఉండదు. అంతేకాదు.. ఈ సంస్థలో దాదాపు 16 వేల మంది వరకు పని చేస్తున్నట్లు చెబుతారు. ఇదొక్కటి చాలు.. ముకేశ్ అంబానీ ప్లానింగ్ ఎంతలా ఉంటుందన్న దానికి.
ఈ గ్లోబల్ కార్పొరేట్ సెక్యూరిటీలో కొలువు దొరకటం అంత సులువైన పని కాదు. ఇందులో చేరాలంటే ఆర్మీ రిక్రూట్ మెంట్ ఎంత క్లిష్టంగా ఉంటుందో.. అంతే కఠినంగా ఉంటుంది. శారీరక, మానసిక పరీక్షలతో పాటు.. వ్యక్తిగత ఇంటర్వ్యూలు.. వారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇలా అన్నింటిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే జాబ్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు. తాజాగా అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకకు జాతీయ.. అంతర్జాతీయ సెలబ్రిటీలు.. ప్రముఖులు రావటం తెలిసిందే. వీరి భద్రత మొత్తం కూడా అంబానీ సెక్యూరిటీ సంస్థనే చూసుకుంది. అందుకే అంటారు.. అంబానీనా మజాకానా అని!