రూట్ మ్యాప్ పవనే ఇచ్చారు...బీజేపీ ఓకే చేస్తుందా...?
అయితే అప్పటి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు దీని మీద స్పందిస్తూ రూట్ మ్యాప్ ఎపుడో పవన్ కి ఇచ్చామని చెప్పారు
By: Tupaki Desk | 18 Sep 2023 6:51 AM GMTసరిగ్గా ఏణ్ణర్థం క్రితం అంటే 2022 మార్చి 14న ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాను అని ప్రకటించారు. అది ఆయన అనాలోచితంగా అనలేదు. వ్యూహాత్మకంగానే ప్రకటించారు. బీజేపీతో పొత్తులో ఉన్నా దిశా నిర్దేశం ఏదీ లేదని తన సొంత క్యాడర్ కి ఇటు రాష్ట్ర ప్రజలకు మరో వైపు బీజేపీ పెద్దలకు చెప్పానుకున్నది చెప్పేశారు.
అయితే అప్పటి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు దీని మీద స్పందిస్తూ రూట్ మ్యాప్ ఎపుడో పవన్ కి ఇచ్చామని చెప్పారు. రెండు పార్టీలు ఏపీలో కలసి పనిచేయడమే రూట్ మ్యాప్ అని ఆయన అన్నారు. కానీ అది మాత్రం జరగలేదు, ఈ లోగా ఎంత దూరం జరగాలో అంత దూరం జనసేన ఏపీ బీజేపీకి జరుగుతూ వస్తోంది. అదే విధంగా టీడీపీకి బాగా దగ్గరవుతూ వస్తోంది.
ఈ క్రమంలో పొత్తులు ఉంటే 2014 మాదిరిగా మూడు పార్టీలతో ఉండాలన్న పవన్ తన మనసులో మాటను ఏనాడూ దాచుకోలేదు. కానీ బీజేపీ పెద్దలు ఆయనకు ఏమి చెబుతున్నారో తెలియదు కానీ వేచి చూడడంతోనే నెలలు గడచిపోయాయి. ఇక బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వదు అనుకున్నారో లేక ఇచ్చినా లేట్ అవుతుంది అనుకున్నారో తెలియదు కానీ పవనే ఏపీలో రూట్ మ్యాప్ ని రెడీ చేసి పెట్టారు.
ఆయన చంద్రబాబుని ములాఖత్ లో పరామర్శించి బయటకు వస్తూ టీడీపీతో పొత్తుల ప్రకటన చేశారు. బీజేపీ కూడా వచ్చి చేరుతుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక తొందరలో తాను ఢిల్లీ వెళ్ళి ఏపీలో టీడీపీ పొత్తు గురించి కేంద్ర పెద్దలకు వివరిస్తాను అని అంటున్నారు. మొత్తానికి బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చిన పవన్ ఇపుడు తానే అది ఇచ్చేశారు
ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ నడవడమే ఆ రూట్ మ్యాప్. ఇపుడు బీజేపీ కి టెస్ట్ పెట్టారు అన్న మాట. బీజేపీ అసలు ఉద్దేశ్యం ఏంటి అన్నది కూడా పవన్ చూడాలని ఇలా చేశారా అన్న సందేహాలు వస్తున్నాయి. వైసీపీకి తెర వెనక మద్దతు ఇచ్చే ఆలోచనతోనే బీజేపీ పవన్ని ముందుకు కదలనీయడం లేదని రెండు పార్టీలు కలసి పోటీ అంటూ ఏపీలో ఓట్ల చీలికకు రంగం సిద్ధం చేస్తోంది అన్నది ఏమైనా ఉందా లేదా అది కూడా ఇపుడు బయటపడుతుంది అంటున్నారు.
బీజేపీ పెద్దలు పవన్ కి ఇచ్చే అపాయింట్మెంట్ చాలా విషయాలకు జవాబు అవుతుంది అని అంటున్నారు. బీజేపీకి ఏపీ పొత్తుల మీద ఇంటరెస్ట్ ఉంటే కనుక పవన్ని పిలిచి మాట్లాడతారు అంటున్నారు. అలా కాకుండా టీడీపీతో పొత్తు వద్దు అనుకున్నా వైసీపీతో వైరం ఎందుకు అని భావించినా న్యూట్రల్ గా ఉండాలని చూస్తారు. అపుడు పవన్ ఢిల్లీ టూర్ అవసరమే ఉండదని అంటున్నారు.
ఆయన మానాన ఆయన టీడీపీతో కలసి ముందుకు పోవచ్చు అంటున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే ప్రస్తుతం బీజేపీ ఫోకస్ అంతా ప్రత్యేక సమావేశాల మీదనే ఉంది అని అంటున్నారు. ఆ సమావేశాలలలో కీలక బిల్లులు ఉన్నాయి వాటికి ఆమోదముద్ర పడాలీ అంటే వైసీపీ ఎంపీల అవసరం ఉంటుంది.
అలా వైసీపీతో క్లోజ్ రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తూ బిల్లులను పాస్ చేయించుకుంటే ఆ తరువాత బీజేపీ ఏపీ మీద చూపు సారిస్తుంది అని అంటున్నారు. తన అసలైన రాజకీయం ఏంటో కూడా చూపిస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీ యాక్షన్ ఏంటి అన్నది తెలియాంటే ఈ నెల 22 వరకూ ఆగి ఆ మీదటనే చూడాలని అంటున్నారు. సో పవన్ రూట్ మ్యాప్ కి బీజేపీ పొలిటికల్ టచ్ ఏంటి అన్నది తెలిసేందుకు తేలేందుకు ఇంకా చాలా సమయం ఉంది అంటున్నారు ఢిల్లీ పెద్దలు.