బీజేపీలోకి వైసీపీ ఎంపీలు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ క్రమంలో ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.
By: Tupaki Desk | 28 Jun 2024 10:34 AM GMTగతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వైసీపీ నుంచి గెలిచిన నలుగురు లోక్ సభ ఎంపీలు బీజేపీలో వెళ్తారాని, ఈ మేరకు ఆ పార్టీ పెద్దలతో చర్చలు నడుస్తున్నాయని.. అన్ కండిషనల్ గా కాషాయం కండువా కప్పుకోవడానికి వైసీపీ ఎంపీలు రెడీ అయిపోయారనే ప్రచారం బలంగా జరిగింది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.
అవును... వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరతారంటూ ఒక ప్రచారం ఇటీవల వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముందుగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ విషయంలో అత్యుత్సాహం చుపిస్తున్నారని.. పెద్దిరెడ్డి పైనా ఒత్తిడి తెస్తున్నారని రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చారు. వీటిపై మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ పార్టీ మారడం లేదని.. వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్నదంతా ఫేక్ ప్రచారమని తెలిపారు. ఇదే సమయంలో... తనకు బీజేపీలో చేరాల్సిన కర్మ పట్టలేదని.. జగన్ తనను సొంత తమ్ముడిలా చూస్తారని.. తనకు వైసీపీని, జగన్ ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమయంలో స్పందించిన సోము వీర్రాజు... వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటువంటి ఆలోచన కానీ, ప్రతిపాదన గానీ లేవని తెలిపారు. ఇదే సమయంలో ఈవీఎంలపై అనుమానాలున్నాయని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అంతా గౌరవించాలని.. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా హుందాతనంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఇక ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఈ సందర్భంగా వీర్రాజు తెలిపారు. ఇందులో భాగంగా... ఏపీకి అవసరమైన నిధులు, ప్రాజెక్టులూ వచ్చేలా కేంద్రంలోని బీజేపీ సర్కార్ బాధ్యతగా వ్యవహరిస్తుందని అన్నారు. ఏపీలో మద్యం పాలసీ.. వైసీపీ ఓటమిలో కీలక భూమిక పోషించిందని వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.