Begin typing your search above and press return to search.

ఏడ్చింది.. వాంతి చేసుకుంది.. చెమటోడ్చింది.. వినేశ్ ‘బరువు’పై భర్త

వినేశ్ పారిస్ ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Aug 2024 3:30 PM GMT
ఏడ్చింది.. వాంతి చేసుకుంది.. చెమటోడ్చింది.. వినేశ్ ‘బరువు’పై భర్త
X

ఇప్పటివరకు 34 ఒలింపిక్స్ జరిగాయి.. వీటిలో దేంట్లోనూ భారత్ కు ఇంతటి గుండె పగిలే సందర్భం ఎదురుకాలేదేమో..? అదే పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేశ్ ఫొగట్ కు తక్రుటిలో రజతం/స్వర్ణం చేజారడం.. బహుశా భారత్ కు మరెప్పుడూ ఇంత గుండె కోత ఎదురవదేమో...? కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్ పతకం కోల్పోవడం ఏమిటో తెలియక భారతీయులు నిశ్చేష్టులైన సందర్భం అది. దీంతోపాటు ఏడాదిన్నర కిందట వినేశ్ ఫొగట్ తనతో పాటు మేటి రెజ్లర్లకు ఎదురైన నేపథ్యంలో అప్పటి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై జరిపిన పోరాటాన్ని తలచకుని తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.

మళ్లీ వస్తావా వినేశ్?..

వినేశ్ పారిస్ ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె మళ్లీ రింగ్ లోకి దిగడం అనేది ఉండదు. పారిస్ ఒలింపిక్స్ లో సెమీస్ లో ఆడిన మ్యాచ్ చివరిది. ఫైనల్స్ కు ముందు ఆమె 50 కేజీల (ప్లస్ 2 కేజీలు) విభాగంలో పోటీపడింది. 100 గ్రాముల అధిక బరువుతో ఫైనల్స్ కు వెళ్లలేకపోయింది. అయితే, పారిస్ నుంచి స్వదేశానికి వచ్చిన వినేశ్‌ కు భారత్‌ లో అపూర్వ స్వాగతం లభించింది. తమ స్వగ్రామం అయిన హరియాణాలోని బలాలిలో స్థానికులు లడ్డూలు బహుమతిగా ఇచ్చారు. తలా కొంత డబ్బు జమ చేసుకుని రూ.21 వేలు అందజేశారు. అయితే, వినేశ్ కు కొన్ని సంస్థలు పెద్దమొత్తం నగదు బహుమతి ప్రకటించాయని.. ఆ మొత్తం విలువ రూ.16 కోట్లు అని కూడా కథనాలు వచ్చాయి. వీటిని వినేశ్‌ భర్త సోమ్‌ వీర్‌ రాఠీ ఖండించాడు. ఇదంతా చౌకబారు ప్రజాదరణ కోసం కొందరు చేసే కుట్రగా అభివర్ణించాడు.

ఆ బరువు.. రెజ్లర్ బాధ్యతనే..

ఒలింపిక్స్ పతకం చేజారిన అనంతరం.. తనకు రజతం అయినా దక్కేలా చూడాలంటూ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్ ) కు వినేశ్ అప్పీల్ చేసింది. కానీ, యునైటెడ్ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం ఏ రెజ్లరైనా బరువు నిరూపించుకోవడంలో విఫలమైతే అనర్హత తప్పదు. వారి అప్పీళ్లను ఎక్కువ సందర్భాల్లో కాస్‌ తిరస్కరిస్తుంది. అంతేకాదు.. యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్‌ ఆర్టికల్- 7 ప్రకారం నిర్ణీత బరువు బాధ్యత రెజ్లర్‌ దే. ఇక వినేశ్ కూడా చాలా అనుభవం ఉన్న రెజ్లరే కాబట్టి.. ఆమె విషయంలో ఎక్కడా వివక్ష చూపలేదని కాస్‌ తేల్చింది.

వాంతి చేసుకుని.. గంటన్నర శ్రమించి..

ఒలింపిక్స్ లో ఫైనల్ కు ముందు రాత్రి వినేశ్ బరువు చూసుకోగా.. 2.7 కిలోలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో బరువు తగ్గే ప్రక్రియను మొదలుపెట్టింది. ఏకంగా గంటా 20 నిమిషాలు వ్యాయామం చేసింది. దీంతో కేజీ 200 గ్రాములు తగ్గింది. కానీ, ఇంకా కేజీన్నర అదనంగా బరువుంది. ఆపై 50 నిమిషాల ఆవిరి స్నానం చేసింది. దీంతో వినేశ్ శరీరంపై చెమట చుక్క కూడా లేకుండా పోయింది. అయితే, అదే రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 5:30 వరకు వినేశ్ కసరత్తులు చేస్తూనే ఉంది. ఆపై ఓపిక నశించి కింద పడిపోయింది. పైకి లేపి సాధన చేయించారు. కానీ.. 100 గ్రాముల అదనపు బరువు మాత్రం అలాగే ఉండిపోయింది. ఇక వీటన్నిటితో పాటు వినేశ్ పడిన శ్రమను ఆమె భర్త రాఠీ వివరించారు. తన కడుపులోనిదంతా బయటకు వెళ్లిపోయేందుకు వినేశ్ వాంతి చేసుకుందని.. చెమటపోయేలా శ్రమించడమేకాక.. ఏ దశలో అదే పనిగా ఏడ్చిందని తెలిపాడు. తద్వారా శరీరంలోని చెబు అంతా బయటకు పంపి బరువు తగ్గేందుకు ప్రతి అవకాశాన్నీ వినియోగించుకున్నట్లు పేర్కొన్నాడు.