ఐఫోన్ కోసం అన్నం మానేసి కొడుకు.. పూలు అమ్ముకునే తల్లి వీడియో వైరల్!
నెట్టింట సందడి చేసే చాలా వీడియోలు నవ్వుకోవడానికి ఉపయోగపడితే, మరికొన్ని చికాకు రావడానికి సహాయ పడుతుంటాయి.
By: Tupaki Desk | 19 Aug 2024 6:16 AM GMTనెట్టింట సందడి చేసే చాలా వీడియోలు నవ్వుకోవడానికి ఉపయోగపడితే, మరికొన్ని చికాకు రావడానికి సహాయ పడుతుంటాయి. ఇంకొన్ని భయందోళనలు కలిగిస్తే.. మరికొన్ని జుగుప్సాకరంగా ఉంటాయి. అయితే చాలా అరుదైన కొన్ని వీడియోలు, సంఘటనలు మాత్రం మనిషిని చాలా ఆలోచించజేస్తాయి. ఎవరికి ఎవరు ఈ లోకంలో.. మనల్ని నిజంగా ప్రేమించేదెవరు ఈ జగతిలో అనే ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కొడుకు ఐఫోన్ కోసం అలిగి అన్నం తినడం మానేశాడని కన్నపేగు తల్లడిల్లిపోయింది. మూడు రోజులు కొడుకు పస్తులుండేసరికి ఆమె ప్రాణం విలవిల్లాడిపోయింది. పూలు అమ్ముకుని జీవనం సాగించే ఆమె ఐఫోన్ కొనగలిగే సాహసం చేసింది. కొడుకు కళ్లల్లో ఆనందం కోసం ఇప్పటివరకూ దాచిందంతా ఇచ్చేసింది. ఈ సందర్భంగా ఆమె కన్నీళ్లను దిగమింగుకుంటూ కనిపించిన దృశ్యాలు వర్ణనాతీతం అనే చెప్పాలి!
అవును... పిల్లలు కోరారు కదా అని కాదన కుండానే కొనిస్తారు తల్లితండ్రులు. అయితే... తల్లితండ్రుల స్థోమతకు తగ్గట్లు అడుగుతున్నామా, నడుచుకుంటున్నామా అని ఆలోచించి కోరికలు కోరే పిల్లలు ఎంతమంది ఉంటారు? కాస్త కష్టమైన ప్రశ్నే ఇది! ఈ నేపథ్యంలో తాజాగా పూలు అమ్ముకుంటూ జీవనం సాగించే తన తల్లిని ఐఫోన్ కొనివ్వాలని అడిగాడు కుమారుడు.. ఆ బ్లాక్ మెయిల్ కి తల్లి తలొచ్చింది.
ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందనే వివరాలు కచ్చితంగా తెలియదు కానీ... తాజాగా నెట్టింట ఓ వీడియో మాత్రం వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ కోసం మూడు రోజుల పాటు అన్నం తినకుండా తల్లిని బ్లాక్ మెయిల్ చేశాడు ఓ కుమారుడు. దీంతో కన్నపేగు తల్లడిల్లిపోయింది. ఫలితంగా... గుడి ముందు పూలు అమ్ముకుని జీవనం సాగించే ఆమె.. కూడబెట్టిన డబ్బంతా కొడుకు చేతిలో పెట్టింది.
అయితే.. డబ్బు కొడుకు చేతిలో పెట్టే నమ్మకం లేకో, ధైర్యం లేకో.. తాను కూడా కొడుకుతో పాటు మొబైల్ ఫోన్ షోరూం కి వెళ్లింది.. ఐఫోన్ కొనిచ్చింది. ఈ సమయంలో వీడియో రికార్డ్ చేశారు అక్కడున్న సిబ్బంది. ఈ సమయంలో ఆ కుర్రాడు చెప్పే మాటల సంగతి కాసేపు పక్కనపెడితే... మూడు రోజులుగా అన్నం తినకుండా అలిగాడు అని ఆ తల్లి చెబుతుంటే... కన్నీళ్లను దిగమింగుకుంటుండటం కనిపించింది!
దీంతో... ఈ వీడియో కింద నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. “ఆ తల్లి అతడిని చెప్పు తీసుకుని కొట్టకుండా ఫోన్ కొనివ్వడం బాధనిపించింది.. నచ్చలేదు” అంటూ పలువురు ఈ సందర్భంగా కామెంట్ చేస్తున్నారు. “ఆమె ముఖ కవలికలు లోలోన దాగున్న ఆవేదనకు అర్ధం పడుతున్నాయని” మరొకరు స్పందించారు.