Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి అలసిపోయారన్న సోనియా : అవమానిస్తున్నారని బీజేపీ ఆగ్రహం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 10:09 AM GMT
రాష్ట్రపతి అలసిపోయారన్న సోనియా : అవమానిస్తున్నారని బీజేపీ ఆగ్రహం
X

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివాసీ మహిళను అవమానిస్తున్నారని మండిపడింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఆ తర్వాత కాసేపటికి సభ వెలుపలికి వచ్చిన కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను మీడియా పలకరించింది. రాష్ట్రపతి ప్రసంగం ఎలా ఉందంటూ ప్రశ్నించింది. దీనికి స్పందించిన సోనియా రాష్ట్రపతి ప్రసంగం చివరకు వచ్చేసరికి అలసిపోయారని, ఆమె సరిగా మాట్లాడలేకపోయారంటూ వ్యాఖ్యానించారు.

అయితే, సోనియా వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఆమె విషయంలో సోనియా వ్యాఖ్యలు అభ్యంతరకరమంటూ బీజేపీ ఆక్షేపించింది. సోనియా, రాహుల్ గాంధీ వంటి స్థాయి ఉన్న నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇలాంటి మాటల ద్వారా కాంగ్రెస్ తన జమీందారీ మైండ్ సెట్ వీడలేదని స్పష్టమవుతోందని బీజేపీ నేతలు విమర్శించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సోనియా వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆదివాసీలకు సోనియా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమెను పూర్ థింగ్, బేచారీ అంటూ సంబోధించడాన్ని నడ్డా ఖండించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బలమైన మహిళ. దేశానికి ఆమె ఎంతో సేవ చేశారు. తక్షణం కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, సాధించిన విజయాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు గత ప్రభుత్వాల కంటే మూడు రెట్లు వేగంతో పనిచేస్తోందని, త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుందని తెలిపారు.