ఇద్దరు అత్యున్నత మహిళల 'మాటల' యుద్ధం.. ఎటు దారితీసిందంటే!
వారిద్దరూ అత్యున్నత మహిళలు. ఒకరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మరొకరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు.
By: Tupaki Desk | 1 Feb 2025 4:17 AM GMTవారిద్దరూ అత్యున్నత మహిళలు. ఒకరు రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు. మరొకరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. పైగా ప్రజలతోనూ ఇద్దరూ మమేకం అయి ఉన్నారు. కానీ, ఇప్పుడు వారి మధ్య 'మాటల' యుద్దం తెరమీదికి వచ్చింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో.. అనే లోగానే.. తీవ్ర విమర్శలకు, వివాదానికి కూడా హేతువుగా మారింది. వారే.. ఒకరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మరొకరు అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ! ఇప్పటి వరకు వివాదాలకు దూరంగా ఉన్న సోనియాగాంధీ తాజా పరిణామంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఏం జరిగింది?
శుక్రవారం ఉదయం 11 గంటలకు.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. గతానికి భిన్నంగా ఈ సారి సుదీర్ఘంగా అయితే ఈ ప్రసంగం సాగిందనే చెప్పాలి. గత పదేళ్లలో మోడీ సర్కారు సాధించిన అభివృద్ధి, పథకాలు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు.. ఇలా అనేక విషయాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇదేసమయంలో పేదలు, దళితులు, మహిళల అభివృద్ది వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఇలా.. మొత్తం 41 నిమిషం పాటు.. రాష్ట్రపతి నిరాఘాటంగా హిందీలో ప్రసంగించారు.(రాసిచ్చిన స్క్రిప్టు).
రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ'' సోనియాగాంధీ చెణుకులు విసిరారు. ''ప్రసంగం చివర్లో రాష్ట్రపతి బాగా అలసిపోయారు. మాట్లాడలేకయారు. పూర్ థింగ్స్'' అని వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్రపతి తన ప్రసంగం చివరలో పేదలు, మహిళా సాధికారత, రైతులకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు. ఈ విషయాల్లో కేంద్రం ఏమీ చేయడం లేదని.. అందుకే చివరలో పెట్టారని అర్ధం వచ్చేలా.. సోనియా వ్యాఖ్యానించారన్నది.. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఆమె పోస్టు చేసిన మరుక్షణంలోనే పెద్ద వివాదంగా మారిపోయింది. అప్పటి వరకు పార్లమెంటులో రాష్ట్రపతి చేసిన ప్రసంగం హైలెట్ కాగా.. సోనియా చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో ఆ ప్రసంగం మొత్తం డామినేట్ అయిపోయింది.
రాష్ట్రపతి, ప్రధాని రియాక్షన్..
గంటలు గడిచే కొద్దీ.. సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యపై అటు రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఇది సరికాదు.. మీ వ్యాఖ్య పేలవంగా ఉందంటూ.. ఓ ప్రకటన విడుదలచేసింది. ఇక, ఏ చిన్న అవకాశం వచ్చినా.. వదులుకోని ప్రధాని మోడీ కూడా .. సోనియా పై నిప్పులు చెరిగారు. ఆదివాసీల ట్యాగ్ తగిలించారు. ఆదివాసీల పట్ల కాంగ్రెస్‌కుచిత్త శుద్ధి లేదని.. వారిని అవమానించడమే వారి ప్రథమ కర్తవ్యమని ఆయన నిప్పులు చెరిగారు. ఇక, మోడీనే రెడీ అయ్యాక.. తాము ఊరుకుంటామా.. అన్నట్టు బీజేపీ నాయకులు సైతం .. సోనియాపై విరుచుకుపడుతున్నారు. ఇదీ.. సంగతి!!