Begin typing your search above and press return to search.

సోనియా ఫ్యామిలీ vs కేసీఆర్ ఫ్యామిలీ.. ఇద్దరు ఒక్కటేనా?

తల్లిని సొంతభద్రతా సిబ్బంది దారుణంగా చంపేసిన వేళ.. మరో దారి లేక.. తమ ఫ్యామిలీ అండగా నిలిచే పార్టీని రక్షించుకునే క్రమంలో కాంగ్రెస్ పగ్గాల్ని చేపట్టటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Oct 2023 4:30 PM GMT
సోనియా ఫ్యామిలీ vs కేసీఆర్ ఫ్యామిలీ.. ఇద్దరు ఒక్కటేనా?
X

అవగాహన లేని విషయం మీద ఎంత మాట్లాడినా బాగుంటుంది. తియ్యటి మాటలతో ఏం చెప్పినా నిజమే అనుకునేలా చేస్తుంది. కానీ.. అందరికి తెలిసిన విషయాల్ని ట్విస్టు చేస్తూ మాట్లాడటం ద్వారా ఒక లాభం అదే సమయంలో మరో నష్టం పొంచి ఉంటుందన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది అని కాంగ్రెస్ పార్టీ అభిమానులు అంటున్నారు, గాంధీ ఫామిలీ అభిమానులు KTR కామెంట్స్ తరువాత రక రకాల విశ్లేషణలు వినిపిస్తున్నారు వాటిని ఒక సారి చూస్తే .

కుటుంబ పాలన.. కుటుంబ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ మాట్లాడటమా? గాంధీ ఫ్యామిలీ కామెంట్ చేయటమా? గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఏరుతునట్లుందన్న కేటీఆర్ వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. గాంధీ ఫ్యామిలీ.. కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే అవుతుందా? అన్న సందేహం ప్రాథమికంగా కలుగక మానదు.

ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఒక వ్యాపారస్తుడు తన పిల్లల్ని వ్యాపారంలో పెడతాడు. ఒక సినీ నటుడి పిల్లలు సినిమా రంగాన్ని ఎంచుకోవటం మామూలే. ఈ విషయానికి వస్తే.. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా తల్లిదండ్రులు అత్యుద్భుత స్థాయికి చేరుకున్న రంగంలోకి వారి పిల్లలు ఆటోమేటిక్ గా రావటం సహజం. గాంధీ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఇందిరాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి యాక్సిడెంటల్ గానే వచ్చారు తప్పించి.. ఆయన ఇష్టంగా వచ్చింది కాదు.

తల్లిని సొంతభద్రతా సిబ్బంది దారుణంగా చంపేసిన వేళ.. మరో దారి లేక.. తమ ఫ్యామిలీ అండగా నిలిచే పార్టీని రక్షించుకునే క్రమంలో కాంగ్రెస్ పగ్గాల్ని చేపట్టటం తెలిసిందే. రాజీవ్ గాంధీ సైతం అనూహ్యంగా హత్యకు గురైన వేళ.. అనూహ్యంగా సోనియాగాంధీ రాజకీయాల్లోకి రావాల్సి రావటమే కాదు.. కాంగ్రెస్ నావను నడిపించాల్సి వచ్చింది. ప్రధాని పీఠం మీద కూర్చునేందుకు ఆమె ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ.. అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్ని గుర్తించిన ఆమె.. పదవి కంటే కూడా కొన్ని అంశాలకు దూరంగా ఉండటం మంచిదని భావించి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మొగ్గు చూపలేదు.

ఇక్కడ ఒక్కసారి ఆగి.. కేసీఆర్ ఫ్యామిలీని చూస్తే.. తెలంగాణ ఉద్యమం కోసం తానున్న తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టటం.. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవటానికి కేటీఆర్ అమెరికా నుంచి రావటం.. కవిత సైతం పార్టీలో భాగస్వామి కావటం తెలిసిందే. ఉద్యమ వేళ మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరంపార్టీ పవర్లోకి వచ్చిన క్రమాన్ని చూసినప్పుడు.. కేసీఆర్ కుటుంబసభ్యులు అనూహ్యంగా రాజకీయ పార్టీల్లోకి వచ్చిన వైనం కనిపించదు.

గాంధీ కుటుంబంతో తమ కుటుంబాన్ని.. తమ కుటుంబ సభ్యుల్ని పోల్చుకునే ప్రయత్నం చేసిన కేటీఆర్.. 2014కు ముందు వరకు తమకు.. తమ కుటుంబానికి ఉన్న ఆస్తుల లెక్కల్ని చూస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. అధికారంలోకి వచ్చినంతనే.. తన కుటుంబంలోని వారికి పదవుల్ని ఇవ్వటాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ మంత్రిగా ఉండటమేకాదు.. ఒక దశలో ఆయన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసి.. చివరకు వెనక్కి తగ్గటాన్ని ప్రస్తావిస్తున్నారు. కుమార్తె ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే.. ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టటం.. మేనల్లుడ్ని మంత్రిగా చేయటంతో పాటు.. బంధువు సంతోష్ ను రాజ్యసభకు పంపటాన్ని ప్రస్తావిస్తున్నారు.

అదే సమయంలో గాంధీ ఫ్యామిలీలో చూస్తే.. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలు ఇద్దరు ఎంపీలుగా ఎన్నికైనప్పటికీ.. ఎలాంటి పదువుల్ని తీసుకోకపోవటాన్ని మర్చిపోకూడదు. నిజానికి పదేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్.. తాను అనుకోవాలే కానీ ప్రధాని కుర్చీలో కూర్చునేందుకు రాహుల్ గాంధీకి అప్పట్లో ఎలాంటి అడ్డు లేదు. ఆ మాటకు వస్తే.. కేంద్ర మంత్రిగా పవర్ ఫుల్ పదవుల్ని పొందే వీలుంది. అయినా వాటిని ఆశించలేదు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ.. గాంధీ కుటుంబం (సోనియా, రాహుల్) ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తనకున్న పరిమితుల్ని తెలుసుకొని అధికారానికి దూరంగా ఉన్న సోనియాకు.. పదవిని చేపట్టేందుకు అడ్డంకులు ఉంటే.. వాటిని పక్కన పెట్టేసి మరీ తాను అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తయ్యే వరకు నిద్రపోని కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటేనా? అన్నది సమస్య. వంశపారంపర్యంగా రాజకీయాల్లోకి కొనసాగటం గాంధీ కుటుంబానికి అనుకోకుండా జరిగిందే తప్పించి.. ప్లాన్ పెట్టుకొని చేసింది లేదు. కానీ.. కేసీఆర్ కుటుంబం మాత్రం అందుకు భిన్నమన్న విషయాన్ని వదిలేసి.. వాదనలు వినిపించటం కనిపిస్తుంది. కేసీఆర్ ది కుటుంబ పాలన అన్న రాహుల్ మాటల్నితప్పు పట్టిన కేటీఆర్.. అందుకు తగ్గ జస్టిఫికేషన్ ఇవ్వకపోగా.. ఆ వాదనను మరింత అర్థమయ్యేలా చెప్పే అవకాశాన్నిఇవ్వటాన్ని తప్పుపడుతున్నారు.

ఇటీవల కాలంలో తప్పు మీద తప్పులు చేస్తున్న కేటీఆర్.. తన మాటల కారణంగా కొత్త వివాదాలకు.. కొత్త చర్చలకు తావిస్తున్నట్లుగా చెప్పక తప్పదు. కీలకమైన ఎన్నికల వేళ.. తాను మాట్లాడే మాటలు తనకు మాత్రమే కాదు.. పార్టీకి సైతం నష్టం వాటిల్లుతుందన్న సత్యాన్ని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే పార్టీకి అంత మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆయన ఈ విషయాన్ని గుర్తిస్తున్నారా?